ఆపిల్ వాచ్ అదుర్స్ ..‘స్విస్’ బ్రాండ్లను దాటేసిన అమ్మకాలు

స్విట్జర్లాండ్ లగ్జరీ, డిజైనరీ, జ్యవెలరీ వాచ్​లకు పెట్టింది పేరు. ఆ దేశ ఎక్స్ పోర్ట్స్ లో వాచ్ ఇండస్ట్రీ దే మూడో స్థానం. అయితే ఇప్పుడా ఇండస్ట్రీని ఆపిల్ కంపెనీ బీట్ చేసింది. వాచీల విక్రయాల్లో ఆపిల్ అదుర్స్ అనిపించుకుంది. స్విట్జర్లాండ్ వాచ్ మార్కెట్ ను దాటేసింది. అక్కడి కంపెనీలన్నింటి సేల్స్ కంటే ఒక్క ఆపిల్ సేల్స్ నే ఎక్కువగా నమోదయ్యాయి. ఆపిల్ 2019 లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3.1 కోట్ల స్మార్ట్ వాచ్​లను అమ్మింది. కాగా స్విట్జర్లాండ్ కు చెందిన అన్ని బ్రాండ్ల వాచ్ లు మాత్రం 2.1 కోట్లే అమ్ముడయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ రిపోర్టులో ఈ మేరకు వెల్లడైంది. ఇది స్విస్ వాచ్ ఇండస్ట్రీకి దెబ్బేనని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే స్విట్జర్లాండ్ మార్కెట్ లో విక్రయమవుతున్న మెకానికల్ వాచెస్ తోనే యాపిల్ వాచ్​ల కంటే అధిక ఆదాయం వస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు. ‘‘ఆపిల్ వాచ్​ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. మిడిల్ రేంజ్ స్విస్ వాచెస్ కు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది” అని సీనియర్ అనలిస్ట్  స్టీవెన్ తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ఆపిల్ వాచ్ లు వస్తుండడం, వాటిలో హెల్త్, ఫిట్ నెస్ కు సంబంధించిన ఫీచర్లు ఉండడం వల్ల యూజర్లు అట్రాక్ట్ అవుతున్నారని రిపోర్టు తెలిపింది. ఓవైపు టెక్నాలజీ, మరోవైపు ఫ్యాషన్ గానూ ఉండడంతో వాటికే ఓటేస్తున్నారంది. ఇంకోవైపు ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు కంపెనీకి అధికంగా ఉన్నారని, వీరి ద్వారానూ వాచ్ సేల్స్ అధికంగా ఉంటున్నాయని పేర్కొంది. స్విస్ కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్ లను విక్రయిస్తున్నప్పటికీ, అవి అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయని తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు స్విస్ వాచ్ మార్కెట్ కు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పింది.

Latest Updates