టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

హైదరాబాద్‍, వెలుగు ఏ కంపెనీలో ఉద్యోగం కావాలన్నా అనుభవం అడుగుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ చదువులు పూర్తయినా వర్క్ ఎక్స్​పీరియెన్స్ లేక సరైన జాబ్స్ పొందలేకపోతున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‍, ఇంటర్‍ ఒకేషనల్‍, ఇంజినీరింగ్‍ కోర్సులు పూర్తి చేసిన వారు వర్క్ ఎక్స్​పీరియెన్స్ కోసం అప్రెంటీస్‍షిప్‍ ఉంది. మరి టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సులు చేసిన వారి పరిస్థితి ఏంటీ?  ఒకేషనల్‍ కోర్సులు కాకుండా జనరల్‍ కోర్సులు చదివిన స్టూడెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని మినిస్ట్రీ ఆఫ్‍ స్కిల్‍ డెవలప్‍మెంట్ అండ్‍ ఎంటర్‍ప్రెన్యూర్‍షిప్‍ ‘నేషనల్‍ అప్రెంటీస్‍షిప్‍ ప్రమోషనల్‍ స్కీం(ఎన్‍ఏపీఎస్‍)’ను తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా టెన్త్ నుంచి డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన వారు సైతం అప్రెంటీస్‍షిప్‍లో భాగంగా ఆన్‍ జాబ్‍ ట్రైనింగ్‍ పొందే అవకాశం కల్పించారు. టెన్త్ క్లాస్‍ స్థాయిలోనే ఆన్‍జాబ్‍ ట్రైనింగ్‍ కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య తగ్గడంతోపాటు ప్రతి ఒక్కరు ఎదో ఒక రంగంలో స్కిల్‍ డెవలప్‍ చేసుకునేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్‍  ఎన్‍ఏపీఎస్‍ ప్రారంభించింది. టెన్త్ క్లాస్‍ నుంచి  డిగ్రీ, పీజీ వరకు స్టూడెంట్స్ ఈ అప్రెంటీస్‍షిప్‍ స్కీంలో చేరి ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు. చదువు పూర్తైన అనంతరం జాబ్స్ రాకపోయినా నేర్చుకున్న స్కిల్స్ తో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడిపేందుకు అప్రెంటీస్‍షిప్‍ స్కీం దోహదం చేయనుంది.

ఆన్‍లైన్‍లో రిజిస్ట్రేషన్‍

అప్రెంటీస్‍షిప్‍ చేసే స్టూడెంట్లకు స్టైఫండ్‍ను సెంట్రల్‍ గవర్నమెంట్‍ చెల్లిస్తుంది. స్టైఫండ్‍ నేరుగా స్టూడెంట్స్ అకౌంట్లోకే వచ్చి చేరుతుంది. ఆన్‍ జాబ్‍ ట్రైనింగ్‍ ఇచ్చే కంపెనీలు దీనికి అదనంగా చెల్లించేలా  ఎన్‍ఏపీఎస్‍ లో గైడ్‍లైన్స్ ఇచ్చారు. సెంట్రల్‍ గవర్నమెంట్ తరపున రూ.1500, అప్రెంటీస్‍షిప్‍ అవకాశం ఇచ్చే కంపెనీలు కూడా దీనికి అదనంగా మరికొత మొత్తాన్ని చెల్లిస్తారు. అప్రెంటీస్‍షిప్‍ కోసం https://www.apprenticeship.gov.in  లో నమోదు చేసుకోవాలి. దీనికి ముందుగా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్‍ చేసుకోని తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ ఎడ్యుకేషనల్‍ క్వాలిఫికేషన్‍లను బట్టి వివిధ కంపెనీలలో ప్రాక్టికల్‍ వర్క్ అనుభవం పొందే వీలుంది. వెబ్‍సైట్‍లో తమ ప్రాంతానికి సంబంధించి  నమోదైన ఇండస్ట్రీలు, కంపెనీలలో అప్రెంటీస్‍షిప్‍కు అప్లై చేసుకోవాలి. ఆ వివరాలు ఆయా జిల్లాల స్కిల్‍ డెవలప్మెంట్‍ మేనేజర్లకు చేరుతుంది. వారు ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్‍ను తీర్చిదిద్దుతారు. అప్రెంటీస్‍షిప్‍కు అర్హత సాధించిన వారికి జిల్లా స్కిల్‍ డెవలప్​మెంట్​ సంస్థ ద్వారా మూడు నెలలపాటు ఉచిత వసతితో కూడిన ఆన్‍జాబ్‍ ట్రైనింగ్‍ అందజేస్తారు. ఎంచుకున్న ఇండస్ట్రీ, కంపెనీలలో  మూడు నెలలు లేదా 500 గంటల పాటు ట్రైనింగ్‍ ఇస్తారు. ఎన్‍ఏపీఎస్‍పై స్కూల్స్, కాలేజీలలో స్కిల్‍ డెవలప్​మెంట్​ ఉద్యోగులు అవగాహన కల్పించడంతోపాటు ఆన్‍లైన్‍లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపడుతున్నారు.

విదేశీ స్ఫూర్తితో..

నేడు డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన వారిలోనూ ఎలాంటి వృత్తి నైపుణ్యాలు ఉండటం లేదు. ఇది దేశాభివృద్ధితోపాటు దేశ ఫైనాన్షియల్‍ సిస్టమ్‍పై కూడా ఒత్తిడి పెంచుతోంది. విదేశాల్లో స్కూల్‍ స్థాయిలోనే స్టూడెంట్స్ వివిధ వృత్తి కోర్సుల్లో అనుభవం సాధించేలా అక్కడి ఎడ్యుకేషన్‍ సిస్టం ఉంది. దీని స్ఫూర్తితో సెంట్రల్‍ గవర్నమెంట్‍ ఎన్‍ఏపీఎస్‍ ను ఇంట్రడ్యూస్​ చేసింది. అప్రెంటీస్‍షిప్‍ స్కీంలో భాగంగా స్టూడెంట్స్ ఇండస్ట్రీలను సందర్శించడంతోపాటు ఉపాధికి అవసరమైన ఆన్‍జాబ్‍ ట్రైనింగ్‍ పొందేలా ప్లాన్‍ చేశారు. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్‍, మ్యూజిక్‍ తదితర తరగతులను గతంలో స్కూల్‍ స్థాయిలో చెప్పేవారు. కేవలం అందులో సాధించిన పరిణతితో జీవితంలో కొందరు ఉన్నతంగా స్థిరపడినవారు ఉన్నారు. సర్కారు, ప్రైవేట్‍ బడుల్లో  ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది.

 

Latest Updates