మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఒక్కరూ దొర్కుతలేరా?

  • కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా పట్టించుకోరా?
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • ఈ నెలాఖరులోగా నియమించాలని ఆదేశం
  • లేదంటే సీఎస్ విచారణకు హాజరు కావాలని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: మహిళా కమిషన్‌‌కు చైర్‌‌పర్సన్‌‌ను నియమించాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్టోబర్‌‌లో ఉత్తర్వులు ఇస్తే ఇప్పటి వరకు చైర్ పర్సన్ ను ఎందుకు నియమించలేదని నిలదీసింది. నియామకం విషయంలో రాష్ట్ర సర్కార్ లేట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైర్ పర్సన్ పదవికి అర్హత ఉన్న ఒక్క మహిళను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని కామెంట్ చేసింది. అసలు చైర్ పర్సన్ నియామకానికి సంబంధించిన ఫైల్ కదిలిందా? లేదా? అని అడిగింది. ఈ నెల 31లోగా చైర్‌‌ పర్సన్‌‌ను నియమించాలని హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో అదే రోజున జరిగే తదుపరి విచారణకు సీఎస్ హాజరు కావాలంది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈసారైనా హామీ నెరవేరుస్తరా?

రాష్ట్ర మహిళా కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పదవి రెండేండ్లకు పైగా ఖాళీగా ఉందని, అయినా రాష్ట్ర సర్కార్‌‌ నియామకం చేయడం లేదని సోషల్‌‌ వర్కర్‌‌ రేగులపాటి రామారావు హైకోర్టులో పిల్‌‌ వేశారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. మహిళా కమిషన్‌‌ లేకపోవడంతో బాధితులు ఫిర్యాదులు చేసేందుకు తగిన వేదిక లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఇప్పటికే కమిషన్‌‌ వద్ద 46 ఫిర్యాదులు పెండింగ్‌‌లో ఉన్నాయని వివరించారు. చైర్‌‌పర్సన్‌‌ లేకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు. చైర్ పర్సన్ ను నియమించాలని జాతీయ మహిళా కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌ రేఖాశర్మ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ స్పందిస్తూ.. ఈ నెలాఖరులోగా చైర్‌‌పర్సన్‌‌ను ప్రభుత్వం నియమిస్తుందని హామీ ఇచ్చారు. గతంలోనూ ఇలాగే చెప్పి చేయలేదని, ఈసారి హామీని అమలు చేయకపోతే తదుపరి విచారణకు సీఎస్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Latest Updates