వలస కార్మికులను పురుగుల్లా చూడకండి..వాళ్లు మనుషులే

హైదరాబాద్, వెలుగు: ‘వలస కార్మికులూ మనలాంటి మనుషులే. వాళ్ల ఆర్థిక దుస్థితి, లాక్‌‌డౌన్‌‌ వల్ల వచ్చిన కష్టాలతో రోడ్డున పడ్డారు. మానవత్వంతో వాళ్లను ఆదుకోవాలే తప్ప హీనంగా చూడొద్దు. పురుగులు, జంతువుల్లా తీసిపారేయొద్దు. కాళ్లు పూర్తిగా చాపుకుని పడుకునేందుకు కూడా వీలులేని చిన్న చిన్న గదుల్లో వాళ్లు బతుకుతుంటారు. అలాంటి గదిలో ఒకరోజు ఉంటే వాళ్ల కష్టాలు తెలిసొస్తాయి’ అంటూ అధికారులపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వలస కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీహార్, చత్తీస్‌‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిరైళ్లలో పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా టైంలో వలస కార్మికుల్ని వదిలేయకుండా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలని హితవు చెప్పింది.

ఇక్కడున్నంతకాలం బాధ్యత ఉంటది

సాధారణ రైలులో బోగీలను ఏర్పాటు చేయలేకపోతే ప్రత్యేకంగా శ్రామిక్‌‌ రైళ్లను నడపాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎగ్జిబిషన్‌‌ సమయంలో ఏర్పాటుచేసే తాత్కాలిక టాయిలెట్స్‌‌ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వలస కార్మికులు ఇక్కడ ఉన్నంతకాలం వారి రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు, గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలింది. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌‌ వాదిస్తూ, శ్రామిక్‌‌ రైలు నడపాలంటే రూ.10 లక్షలు అవుతుందని, రైల్వే శాఖ సాధారణ రైలుకు నాలుగు బోగీలను వలస కార్మికులకు కేటాయించడంలేదని చెప్పారు. మరో లాయర్‌‌ వాదిస్తూ, 120 మంది ఉండే స్కూల్​లో 350 మంది కార్మికులను ఉంచారని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. అక్టోబర్‌‌ 20 వరకూ రిజర్వేషన్లు అయ్యాయని, వాటిని రద్దుచేసి వలస కార్మికులకు ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే లాయర్‌‌ కౌర్‌‌ చెప్పారు. రైల్వే వెయిటింగ్‌‌ రూమ్స్‌‌ ఇవ్వడమూ సాధ్యం కాదన్నారు. వాదనల అనంతరం హైకోర్టు.. కార్మిక, సాంఘిక సంక్షేమ, రైల్వే శాఖల అధికారులు వలస కార్మికులకు కల్పించిన వసతులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

రైల్వేకు ఆదాయమే లక్ష్యమా?

రైల్వే శాఖ ఆదాయమే ధ్యేయంగా ఉండకూడదని, సాధారణ రైళ్లలో వలస కార్మికులకు 4 బోగీలను కేటాయిస్తే ఈ సమస్య చాలా వరకూ పరిష్కారమయ్యేదని పేర్కొంది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ప్రొఫెసర్‌‌ రామశంకర్‌‌ నారాయణ మేల్కొటి, లాయర్‌‌ పీవీ కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్‌‌ కుమార్‌‌ దాఖలు చేసిన పిల్స్‌‌ను శుక్రవారం హైకోర్టు మరోసారి విచారించింది. రైళ్ల ద్వారా వలస కార్మికుల్ని పంపే వరకూ వారికి తిండి, వసతి, నీరు, వైద్యం వంటివి ప్రభుత్వమే కల్పించాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లే అవుతుందని హెచ్చరించింది.

చైనా కంటే మనమే బలంగా ఉన్నాం

Latest Updates