కార్తీకమాసంలో ఉపవాసాలు ఉంటున్నారా..

కార్తీకమాసంలో ప్రతి రోజూ ఒక పండుగే. ఉపవాసాలు, దీపారాధనలు, కార్తీకస్నానాలు, వ్రతాలు, వనభోజనాలు..ఇలా కార్తీకమాసమంతా  సందడి సందడిగా ఉంటుంది. ఈ నెలలో భగవంతుణ్ని నిష్ట, నియమాలతో పూజిస్తారు. అలాంటి నియమాల్లో ఒకటి ఉపవాసం. కార్తీకమాసంలో ఉపవాసాలు చేస్తే ఆధ్యాత్మికంగా ఎంత మంచిదో ఆరోగ్యపరంగానూ అంతే  మంచిదంటున్నారు నిపుణులు.

కార్తీక మాసంలో వచ్చే ప్రతీ సోమవారం ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్రాలు చూసిన తరువాతే భోజనం చేస్తుంటారు చాలామంది. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని నమ్మకం. ఉపవాసం ఉండడమనేది సైంటిఫిక్ గానూ చాలా మంచిది. వారం రోజులు కష్టపడి ఆదివారం ఒక్క రోజు శరీరానికి రెస్ట్ ఇస్తుంటాం. అలాగే వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు రెస్ట్ దొరుకుతుంది. ఇలా ఒక రోజు రెస్ట్ ఇస్తే ఆ తరువాత రోజు జీర్ణవ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తల్ని పాటించాలంటున్నారు.  

ఉపవాసం ఉన్న రోజు కచ్చితంగా నీళ్లు

ఎక్కువగా తాగాలి. కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ఒకేసారి కాకుండా గంటకొకసారి  నీళ్లు తాగాలి.

బీపీ,షుగర్​ ఉన్నవాళ్లు ఏదో ఒక ప్లూయిడ్స్ తీసుకుంటుండాలి. ఒకేసారి ఫుడ్ ఆపేస్తే శరీరంలో బీపీ, షుగర్​ లెవెల్స్ పడిపోయే,పెరిగే ప్రమాదం ఉంది. అందుకే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, పాలల్లో ఏదో ఒకటి తీసుకోవడం మంచిది.

ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తున్నట్లు ఎక్కువగా అనిపిస్తే నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిది. ఫుడ్ పై ధ్యాసను పోగొట్టే గుణం నిమ్మ కాయకు ఉంటుంది. అందుకే తేనె, నిమ్మరసం తాగిన తరువాత ఏమీ తినాలనిపించదు. రోజంతా ఫాస్టింగ్ కొనసాగించొచ్చు.

ఏ ఏజ్ లో ఉన్నవారైనా ఉపవాసం చేయొచ్చు. కానీ సరైన కేర్ తీసుకోవాలి. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించకుండా చూసుకోవాలి. అందుకే తేనె, నీళ్లు, కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ, చెరుకు రసం, బార్లీ, సగ్గుబియ్యం నీళ్లు లాంటివి మధ్య మధ్యలో తీసుకోవాలి.

ఉపవాసం మంచిదే కానీ..

చలికాలంలో డైజెషన్ సమస్యలు  ఎక్కువగా వేధిస్తాయి. ఏ ఫుడ్ తిన్నా తొందరగా డైజెషన్ కాదు. అందువల్ల ఈ కాలంలో అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండటం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది.అయితే ఉపవాసాలు అంటే ఉదయం నుంచి రాత్రి వరకూ ఏమీ తినకుండా..తాగకుండా చేయడం కాదు. ఇలా చేస్తే కార్తీకమాసం పూర్తయ్యేసరికి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఉపవాసం ఉంటున్నవాళ్లు కచ్చితంగా పండ్లు, ఫ్లూయిడ్స్, సలాడ్స్ వంటివి తీసుకోవాలి. అదేవిధంగా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు వీటిని తీసుకోవడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. షుగర్, బీపీ ఉన్నవాళ్లు ఉపవాసాలు చేస్తుంటే కచ్చితంగా డైట్ లో మార్పులు చేసుకోవాలి. శరీరానికి తగ్గట్టుగానో లేక డాక్టర్ల సలహాలతోనో ఫాస్టింగ్ ఉంటే బెటర్. –డాక్టర్ సుజాత స్టీఫెన్​, న్యూట్రీషియనిస్ట్​ యశోధ హాస్పిటల్, హైదరాబాద్

Latest Updates