ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సచిన్ కొడుకు.. బాంద్రా బ్లాస్టర్స్‌పై అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో!

ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సచిన్ కొడుకు.. బాంద్రా బ్లాస్టర్స్‌పై అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో!

Arjun Tendulkar: క్రికెటర్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు. టీ20 ముంబై లీగ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ లో రెచ్చిపోవడంతో తన జట్టుని ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. సోమవారం నాడు వాంఖడే స్టేడియంలో బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన పోరులో ఏఆర్‌సీఎస్ అంధేరి తరఫున ఆడిన అర్జున్, ఫస్ట్ బౌలింగ్‌లో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకొగా, ఆపై బ్యాటింగ్‌లో 66 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అంధేరి జట్టు 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. 

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ జట్టును అర్జున్ తన లెఫ్ట్ ఆర్మ్ పేస్‌తో తీవ్ర ఇబ్బంది పెట్టాడు. తన ఫస్ట్ ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుకి షాక్ ఇచ్చాడు. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసి, ఒక మెయిడెన్‌తో సహా కేవలం 11 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో బాంద్రా బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులే చేసింది. ఓం కేశ్‌కామత్ (49), సాగర్ ఛబ్రియా (44) రాణించినప్పటికీ, జట్టు స్కోరును మాత్రం పెంచలేకపోయారు.

అనంతరం 145 రన్స్ లక్ష్య ఛేదనలో థర్డ్ ప్లేస్ లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే అర్థ శతకం బాదిన అతడు, మొత్తం 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 66 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో ముషీర్ ఖాన్ (38 బంతుల్లో 54 నాటౌట్) కూడా రాణించడంతో వీరిద్దరూ సెకండ్ వికెట్‌కు అజేయంగా 116 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా అంధేరి జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే టార్గెట్ ని ఛేదించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

సచిన్ వారసుడిగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న అర్జున్, ఈ ప్రదర్శనతో తనలోని సత్తా చాటాడు. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఎక్కువ ఛాన్స్ లు రాకపోవడంతో.. ఇలాంటి లీగ్ మ్యాచ్‌లలో రాణించడం అతని కెరీర్‌కు చాలా ముఖ్యం.. తన తండ్రి ఎన్నో చిరస్మరణీయ విజయాలని అందుకున్నప్పటికీ, వాంఖడే స్టేడియంలోనే అర్జున్ ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను అర్జున్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది.