వణికిన పాక్ ఆర్మీ చీఫ్.. అభినందన్‌‌ను విడుదల చేయకపోతే యుద్ధం జరిగేది

న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ బాజ్వా వణికిపోయారట. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాధిక్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌‌ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. భారత్‌‌పై దాడి చేసేందుకు పాక్ యుద్ధ విమానాలు వచ్చిన వెంటనే భారత ఫైటర్ జెట్లు వాటిని వెంబడించాయి. ఈ క్రమంలో పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయిన అభినందన్.. ఒక పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశారు. ఇదే సమయంలో తన విమానం కూలిపోతుండటంతో.. అభినందన్ ప్యారాచూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత పాక్ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అభినందన్‌‌‌ను విడుదల చేయకపోతే పాక్ పై ఇండియా యుద్ధానికి సిద్ధమయ్యేది. దీని గురించి అయాజ్ సాధిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో సాధిక్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అభినందన్‌‌ను మా ఆర్మీ అదుపులోకి తీసుకున్నాక హై-లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌‌కు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాలేదు. విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం హాజరయ్యారు. ఆ సమయంలో అభినందన్‌‌ను వదిలిపెట్టండి.. లేదంటే రాత్రి 9 గంటలకు ఇండియా మనపై దాడి చేసే అవకాశం ఉందని బజ్వాతో ఖురేషి చెప్పారు. ఆ మాట వినగానే బజ్వా భయంతో వణికిపోయారు’ అని పేర్కొన్నారు.

Latest Updates