నాన్నా క్షమించు.. నిన్ను వదిలి వెళ్తున్నా.. ఆర్మీ దినోత్సవం రోజే జవాను మృతి

అనారోగ్యం పాలైన తండ్రిని చూసేందుకు వచ్చిన ఆర్మీ జ‌వాన్ దుర‌దృష్ట వ‌శాత్తు ఓ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నిజమాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్‌ తండాలో ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మారుమూల గిరిజ‌న కుటుంబంలో పుట్టి, దేశ స‌రిహ‌ద్దుల్లో జ‌వానుగా విధులు నిర్వ‌హిస్తున్న దెగవత్ మోతీలాల్ (25).. 15 రోజుల సెల‌వు నిమిత్తం ఇంటికి వ‌చ్చి.. తిరుగు ప్ర‌యాణానికై ఏర్పాట్ల నేప‌థ్యంలో ప్ర‌మాదానికి గురయ్యాడు. 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివ‌రికి ఆర్మీ దినోత్స‌వం రోజునే ప్రాణాలు కోల్పోయాడు.

మేగ్యానాయ‌క్ తండాకు చెందిన దెగవత్ జోధ్యానాయ‌క్, జ‌మ్లీబాయి దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు. రెండ‌వ కుమారుడు మోతీలాల్ ఆర్మీలో ప‌ని చేస్తున్నాడు. త‌న తండ్రికి కాలు విరిగింద‌న్న విష‌యం తెలుసుకొని సెల‌వుపై ఇంటికి వ‌చ్చిన అత‌ను.. తండ్రికి స‌ప‌ర్య‌లు చేసి తిరుగు ప్ర‌యాణానికై టికెట్ బుక్ చేసుకునేందుకు డిసెంబర్‌ 28న కామారెడ్డి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదంలో ‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

మోతీలాల్‌ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చారు. భగవంతుడు జవాన్‌ ఆత్మకు శాంతి చేకూర్చాలనీ, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Latest Updates