బోర్డర్‌లో కంచె దాటి భారత్‌లోకి చొరబడిన పాకిస్థానీ.. అదుపులోకి తీసుకున్న ఆర్మీ

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉండే ఇనుప కంచెలను దాటుకుని భారత్‌లోకి చొరబడిన ఒక పాకిస్థాన్ వ్యక్తిని ఆర్మీ జవాన్లు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సరిహద్దు దాటిన ఆ పాకిస్థానీని ప్రస్తుతం ఆర్మీ అధికారులు విచారిస్తున్నారు.

ఫిరోజ్‌పూర్ జిల్లా హుస్సేనీవాలా ప్రాంతంలో భారత్ – పాకిస్థాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద నిత్యం బీఎస్ఎఫ్ పహారా ఉంటుంది. ఆ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి ఆర్మీ జవాన్లు మరో ఏరియాలో పెట్రోలింగ్‌కు వెళ్లిన సమయంలో ఇనుప కంచెలు దాటుకుని భారత్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు 200 మీటర్ల దూరం లోపలికి నడుచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని మన జవాన్లు గుర్తించారు. అనుమానాస్పదంగా అనిపించడంతో అతడిని అడ్డుకున్నారు. తనిఖీలు చేయగా పాకిస్థాన్ కరెన్సీ రూ.5 వేలు ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకుని ఆర్మీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బోర్డర్ ఎందుకు దాటడన్న విషయం తేల్చేపనిలో పడ్డారు. కాగా, రెండ్రోజుల క్రితం లఢఖ్‌లో ఓ చైనా సైనికుడు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించగా.. అతడిని మన ఆర్మీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అతడి వద్ద మిలటరీ డాక్యుమెంట్లు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ చైనా సైనికుడు పొరబాటున సరిహద్దు దాటాడని, ప్రాథమిక విచారణ పూర్తయ్యాక దౌత్య, మిలటరీ ప్రొసీజర్స్ ప్రకారం అతడిని తిరిగి చైనాకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.

Latest Updates