పాక్ దాడికి ఆధారాలివిగో: ఎఫ్-16 ముక్కల్ని చూపిన ఆర్మీ

ఎఫ్-16 యుద్ధ విమానం భాగాలు

న్యూఢిల్లీ: పాక్ ఆర్మీ భారత గగనతలంలోకి ప్రవేశించి, భారత్ పై దాడికి యత్నించిందనడానికి పక్కా సాక్ష్యాలున్నాయని మన ఆర్మీ చెప్పింది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం ఏడు గంటలకు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌పై పాక్ దాడులకు పాల్పడిందడానికి ఆధారాలు చూపించారు. భారత వాయుసేన కూల్చిన పాక్ కు చెందిన ఎఫ్-16 ఎయిర్‌క్రాఫ్ట్ ముక్కల్ని మీడియా ముందు ఉంచారు. అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారని చెప్పారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.

అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్నాం: ఎయిర్ వైస్ మార్షల్

‘భారత గగనతలంలోకి పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు వచ్చాయి. భారత సైన్యం, ప్రజలపై దాడులకు తెగబడటానికి ప్రయత్నించాయి. భారత భూభాగంలో పాక్ బాంబులు కూడా పడ్డాయి. అయితే మనకు ఎటువంటి నష్టం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ మిగ్-21 బైసన్ జెట్స్ తో వాటిని తిప్పికొట్టింది. ఈ ప్రయత్నంలో పీవోకేలో మిగ్ విమానం కూలిపోయింది. దీంతో పైలట్‌ అభినందన్ ను పాక్ బంధించింది. వింగ్ కమాండర్ అభినందన్ తిరిగొస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఎయిర్‌ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు.

దాడులకు తెగబడితే ఉపేక్షించం: ఆర్మీ మేజర్ జనరల్ సురేంద్ర సింగ్

‘పాక్ దాడి ప్రయత్నాలను మేం తిప్పికొట్టాం. పాక్ ఎయిర్‌ఫోర్స్ మా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించింది. కానీ నియంత్రణ రేఖ వెంబడి సైన్యం సిద్ధంగా ఉంది. దీంతో పాక్ దాడులను తిప్పికొట్టాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. శాంతి, సుస్థిరతలకు భారత సైన్యం కట్టుబడి ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా దాడులకు తెగబడితే ఉపేక్షించబోం’ అని ఆర్మీ మేజర్ జనరల్ సురేంద్ర సింగ్ బహల్ తెలిపారు.

పాక్ లో ఉగ్ర శిబిరాలను వదలేది లేదు: నేవీ రియర్ అడ్మిరల్ గుజ్రాల్

‘పాకిస్థాన్ దాడి చేస్తే.. ఘాటుగా బదులిచ్చేందుకు నేవీ సహా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత రక్షణకు మేం ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదంపైనే మా పోరాటం. పాక్ ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఆపకపోతే.. ఆ దేశంలోని ఉగ్ర క్యాంపులను వదిలేదిలేదు. ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లూ పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాం’ అని నేవీ రియర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్ చెప్పారు. ఫిబ్రవరి 14 నుంచి పాక్ 35సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఫిబ్రవరి 26న మన మిరాజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాక్‌లో దాడులు చేశాయని, ఈ దాడిలో ఉగ్రశిబిరాలు దెబ్బతిన్నాయని, అయితే దాడిలో ఎంత మంది చనిపోయారని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఎయిర్‌ వైస్ మార్షల్ తెలిపారు.

Latest Updates