పరిహారం కోసం నాలుగేండ్లుగా ఆఫీసుల చుట్టూ..

పరిహారం ఇచ్చేదెన్నడు?

నాలుగేండ్లుగా ఎదురు చూస్తున్న దాచారం భూ నిర్వాసితులు

సిద్దిపేట, వెలుగు: ప్రాజెక్టు నిర్మాణంలో భూములు మునిగిపోయి నాలుగేండ్లు గడుస్తున్నా నిర్వాసితులకు మాత్రం పరిహారం అందలేదు. దీంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం భూ నిర్వాసితుల ఆఫీస్​ల పొంటి తిరుగుతున్నా ఫాయిదా లేకుండా పోతోంది. బెజ్జంకి మండలం తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో దాచారం గ్రామంలో 400 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. 2014లో భూసేకరణ  సమయంలో  377 ఎకరాల భూములకు పరిహారాలను రైతులకు చెల్లించారు. ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున, బోర్లు..బావులకు ప్రత్యేకంగా పరిహారాలు చెల్లించారు. దాచారంలోని 40 మంది దళిత రైతులకు చెందిన 33 ఎకరాల భూమికి మాత్రం పరిహారం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు.

జీవనాధారం పోయింది

తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి భూములు సేకరించేటప్పుడు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ఆఫీసర్లు.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడంలేదు. నిర్వాసితులు ఆఫీసర్ల పొంటి తిరుగుతున్నా స్పందించడంలేదు. రెండేళ్ల కింద తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నీళ్లతో నింపడంతో దళితులకు చెందిన ఆ భూములన్నీ నీటమునిగాయి. దీంతో వాళ్లకు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పంట పొలాలతోనే జీవనం గడుపుతున్న ఆ రైతు కుటుంబాలు రోడ్డున పడ్డట్లయింది.

50 ఏండ్ల కిందే పట్టాలు

1970 లలో సర్కారు నుంచి పట్టాలు పొందిన 50 మంది వరకు దాచారం గ్రామ దళిత రైతులు.. ఆ భూముల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేసే ముందువరకు సాగు చేసుకున్నారు. వీళ్లలో కొందరు క్రాప్ లోన్లు తీసుకుని పొలాలు వేసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన  402 సర్వే నెంబరులోని 6.25 ఎకరాల భూమికి చెందిన 8మంది రైతులకు మాత్రం పరిహారం ఇచ్చిన ఆఫీసర్లు.. మిగిలిన 23 ఎకరాలకు మాత్రం పరిహారం పెండింగ్​లో పెట్టారు. దీంతో 402 సర్వే నెంబరులో  23 ఎకరాలు, 499 సర్వే నెంబరులో 10 ఎకరాల్లో పట్టాలు పొందిన మొత్తం 40 మంది రైతులు ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు..

ఆఫీసర్లకు  నిర్వాసితుల అర్జీలు

భూములు కొల్పోయిన 40 మంది నిర్వాసితులు పరిహారం కోసం నాలుగేండ్లుగా ఆఫీసర్లకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. పెద్దాఫీసర్లను కలిసి గోడు విన్నవించుకున్నా హామీలే తప్ప పరిహారం అందట్లేదు. రకరకాల కారణాలతో పరిహారం విషయం దాటవేస్తున్నారని,  బడ్జెట్ లేదని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు.

పరిహారం కోసం పడిగాపులు

ప్రాజెక్టులో  ఎకరం పొలం పోయింది. పరిహారం కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నం. ఆఫీసు ల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవట్లే. పూటకో మాట చెప్తూ.. ఇప్పుడు  బడ్జెట్   లేదంటున్నారు.
‑ టి.రాజ దుర్గయ్య, దాచారం

ఆఫీసర్లందర్నీ కలిసి కోరినం

‑పరిహారం కోసం అందుబాటులో ఉన్న ఆఫీసర్లందర్నీ కలిసినం. హామీ ఇస్తున్నరు. బడ్జెట్ లేదంటున్నరు. రెండు సర్వే నెంబర్ల లోని నిర్వాసితులైన 40 మంది రైతులకు పరిహారం ఇవ్వాలె.

‑ కొలిపాక రాజు, ఎంపీటీసీ, దాచారం

For More News..

సంక్రాంతికి 146 స్పెషల్‌‌‌‌ ట్రైన్స్.. 30% అదనపు ఛార్జీలు

గర్భిణీ ఉద్యోగులకు వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌

ఫేక్‌‌‌‌ ఇన్వాయిస్‌‌‌‌లతో 67.7 కోట్ల జీఎస్టీ ఎగవేత

Latest Updates