భద్రాద్రి రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి

భద్రాద్రి రాములవారి కళ్యాణానికి  ఏర్పాట్లు పూర్తి

భద్రాచలం సీతారాముల  కళ్యాణానికి  సర్వం సిద్ధం  చేశారు అధికారులు. రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి  రామయ్య  పట్టాభిషేకం  వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే విద్యుత్ దీపాల  అలంకరణలతో  రామాలయం భక్తులకు  కనువిందు చేస్తోంది. భక్తులకు  కావాల్సిన సకల ఏర్పాట్లు  చేస్తున్నారు ఆలయ అధికారులు.  రెండేళ్ల తర్వాత  మొదటిసారి భక్తులను రాములోరి కళ్యాణానికి  అనుమతి ఇస్తుండటంతో  పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ అధికారులు.

దక్షిణ అయోధ్యగా  పేరుగాంచిన   భద్రాచలం  సీతారామచంద్ర స్వామి  దేవస్థానంలో రేపు జరగనున్న కళ్యాణానికి   ఈ ఏడాది భక్తులు  భారీగా వస్తారని  అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు  తగ్గట్టు   లడ్డూ ప్రసాదాలు, తలంబ్రాలను  భారీగా సిద్ధం  చేశారు. ఇవాళ సాయంత్రం  ఎదుర్కోలు ఉత్సవం  అనంతరం గరుడవాహన సేవ,  రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి  రామయ్య మహాపట్టాభిషేకం  జరగనున్నాయి. కరోనా కారణంగా  రెండేళ్లుగా కల్యాణానికి  భక్తులకు  అనుమతి లేకపోవడంతో... ఈ ఏడాది  భారీగా భక్తులు చేరుకుంటున్నారు. 

భక్తుల తాకిడికి తగ్గట్టు భద్రాచలంలో  ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద పెద్ద LED  స్క్రీన్లు ఏర్పాటు  చేశారు. ఎండా కాలం  కావడంతో.. చలువ పందిళ్లు, షామియానాలు, కూలర్లను ఏర్పాటు  చేశారు. మంచినీరు  అందుబాటులో ఉంచారు.  మిథిలా స్టేడియంను సర్వాoగ  సుందరంగా  తీర్చిదిద్దారు. భక్తుల కోసం  170 క్వింటాళ్ల  తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు  సిద్ధం చేశారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు  50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు పెట్టారు.  బ్రహ్మోత్సవాలకు  దాదాపు 2 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేశారు. 

ఆలయం మొత్తం  తీరొక్క పూలు,  విద్యుత్ దీపాలతో  అలంకరించారు. భక్తులకు వెల్కమ్ చెప్తూ స్వాగత ద్వారాలు  ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దాదాపు 2వేల మందికి పైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలంను మొత్తం 12 సెక్టార్లుగా విభజించి.. 7 ప్రాంతాలలో పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు 16 మంది డీఎస్పీలు.. 54మంది సీఐలు.. 270మంది ఎస్ఐలు.. స్పెషల్ ఫోర్సెస్ తో... పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు