అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దాంతో అసెంబ్లీ పరిసరాలలో పోలీసులు భారీగా మోహరించారు. అసెంబ్లీ ముట్టడికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా.. రోడ్లపైకి వచ్చిన మరికొందరిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు.

హైదరాబాద్ తార్నాకలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములతో పాటు కార్యకర్తలను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బీజేపీ నేతలను నిన్న రాత్రి నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి హైదరాబాద్ బయలుదేరిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట్, కోహెడ, దుబ్బాక మండలాల్లోని బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి సహా 30 మందిని అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోను బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

For More News..

రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు

దుబాయ్‌లో మనోడికి 7 కోట్ల జాక్ పాట్‌

రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్

Latest Updates