రెలిగేర్‌ కేసు: ‘రాన్ బాక్సి’ శివిందర్‌ సింగ్‌ అరెస్ట్

రూ. 740 కోట్లు దారి మళ్లించారని రెలిగేర్‌ ఆరోపణ
పత్తాలేని మల్విందర్ సింగ్‌, ఇప్పటికే లుకవుట్‌ నోటీస్‌ జారీ
రెలిగేర్‌ మాజీ సీఈఓ సునీల్‌ గోధ్వాని అరెస్టు

న్యూఢిల్లీ : ప్రమోటర్‌‌, ఫోర్టిస్ హెల్త్‌‌కేర్‌‌ కో–ఫౌండర్‌‌ శివిందర్‌‌ సింగ్‌‌ను ఢిల్లీ పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) గురువారంనాడు అరెస్టు చేశారు. రెలిగేర్‌‌ ఎంటర్‌‌ప్రైజస్‌‌ ఇచ్చిన ఫిర్యాదు మీద శివిందర్‌‌ సింగ్‌‌తోపాటు మరో ముగ్గురినీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 740 కోట్ల మేర డబ్బును   దారి మళ్లించారని రెలిగేర్‌‌ ఎంటర్‌‌ప్రైజస్‌‌ శివిందర్‌‌ సింగ్‌‌, ఇతరులపై ఫిర్యాదు చేసింది. అరెస్టైన వారిలో కవి అరోరా, అనిల్‌‌ సక్సేనా, రెలిగేర్‌‌ మాజీ సీఈఓ, మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ సునీల్‌‌ గోధ్వానిలు ఉన్నారు. రెలిగేర్‌‌ ఎంటర్‌‌ప్రైజస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఈఎల్‌‌)లో మేనేజ్‌‌మెంట్‌‌ మారిన తర్వాత కంపెనీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ కంపెనీలోంచి డబ్బు అప్పుగా తీసుకుని, శివిందర్‌‌ సింగ్‌‌, అతని సోదరుడికి చెందిన కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టినట్లు కొత్త మేనేజ్‌‌మెంట్‌‌ కనుగొంది.

దాంతో ఢిల్లీ పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) వద్ద ఫిర్యాదును ఆర్‌‌ఈఎల్‌‌ దాఖలు చేసిందని, అనంతరం ఎఫ్‌‌ఐఆర్‌‌ రిజిస్టర్‌‌ చేశామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కుటుంబ వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేదని ఆరోపిస్తూ అన్న మల్విందర్‌‌ సింగ్‌‌, గోధ్వానిలపై శివిందర్‌‌ సింగ్‌‌ మరో కేసునూ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌‌ ఆరోపణలపై రాన్‌‌బాక్సి మాజీ ప్రమోటర్లైన శివిందర్‌‌, మల్విందర్‌‌ సింగ్‌‌ల కార్యాలయాలపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) ఈ ఏడాది ఆగస్టులో దాడులు నిర్వహించింది. పీఎంఎల్‌‌ఏ కింద కేసు నమోదవడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది.

Latest Updates