మావోయిస్టు అయితే అరెస్టు చేస్తారా?: కేరళ హైకోర్టు

కోచి: మావోయిస్టు సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారనే అనుమానంతో వేధింపులకు గురి చేయడం సరికాదని పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టుగా అనుమానిస్తూ 2014లో కేరళ స్పెషల్ స్క్వాడ్ పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబడుతూ   బాధితుడికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ సమర్థించింది. కేరళ ప్రభుత్వం వేసిన అప్పీల్ ను చీఫ్ జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ లతో కూడిన బెంచ్ కొట్టివేసింది. పౌరులకు ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ఏ మతాన్నైనా అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని బెంచ్ ప్రస్తావించింది. ఒక వ్యక్తి తనకు నచ్చిన రాజకీయ సిద్ధాంతాన్ని ఫాలో అవడం ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని పేర్కొంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనలు పాటించకుండా వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం, ఇంటిని తనిఖీ చేయడం అన్యాయమని చెప్పింది. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడనంతవరకు మావోయిస్టు అయినా అదుపులోకి తీసుకోరాదని 2015లో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మన రాజకీయ వ్యవస్థలో మావోయిస్టు ఐడియాలజీకి చోటు లేకపోయినా.. మావోయిస్టుగా ఉండటం నేరం కాదని, హైకోర్టు మాజీ జడ్జి కుమారుడు శ్యామ్ బాలకృష్ణన్ కు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని గతంలో  ఆదేశించింది.

Latest Updates