బెంగాల్ కోటలో ఓట్ల వార్ : టీఎంసీ Vs బీజేపీ

 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత దేశంలో అత్యధిక లోక్ సభ సీట్లు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 42 లోక్ సభ సీట్లున్న బెంగాల్ లో రాజకీయ చైతన్యం ఎక్కువ. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ 2014 వరకు నామ మాత్రపు పార్టీలే. కాంగ్రెస్ నుంచి విడిపోయి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థా పించిన తర్వాత పోటీ ప్రధానంగా సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్ మధ్యనే జరిగింది. ఇప్పుడు తృణమూల్ వర్సెస్ బీజేపీలా మలుపుతీసుకుంది. తృణమూల్ కు ఇప్పటికిప్పడు వచ్చిన ముప్పేమీలేదు. కానీ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న తీరు.. తృణమూల్ క్యా డర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. సంప్రదాయ ప్రతిపక్ష పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్ ను పక్కకుతోసి కమలం తన పరిధి విస్తరించుకుంటోంది.

గత సంవత్సరం జరిగిన ఉలుబేరియా లోక్ సభ బై ఎలక్షన్ లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. మైనారిటీ వర్గానికి చెందిన ఆ పార్టీ అభ్యర్థి అహ్మద్.. నాలుగు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ మాలిక్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. సీపీఎం, కాంగ్రెస్ మూడు నాల్గో స్థానాలకే పరిమితమయ్యాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కన్నా ఈసారి తృణ మూల్ మెజారిటీని పెంచుకుంది. కాని బీజేపీ రెండో స్థానాన్ని చేజిక్కించుకోవడం ఇటు తృణమూల్ కు, అటు సీపీఎం, కాంగ్రెస్ లను కలవరపరుస్తోంది. ఇక నేపర అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సేమ్ సీన్. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఎంసీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈ ఉపఎన్నికల ఫలితాలు.. తృణమూల్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనని స్పష్టం చేస్తున్నాయి. సీపీఎం, కాంగ్రెస్ నామ్ కే వాస్తేగా మారడం.. రెండో స్థానానికి బీజేపీ రావడం.. బెంగాల్ పార్టీలను సవాల్ చేసినట్లైంది. ఇదే తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆందోళన కలిగిస్తున్న పరిణామం. కాంగ్రెస్, సీపీఎం కన్నా కమలం పార్టీని ఎదుర్కోవడం కష్టమన్నది ఆమెకు బాగా అర్థమైంది. కాషాయ పార్టీ రాకతో ఓట్ల పునరేకీకరణ జరగదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్, సీపీఎం నుంచి ముస్లిం ఓటు బ్యాంకును మమత గుప్పిటపెట్టుకున్నారు. బెంగాల్ లో ముస్లిం ఓటర్ల ప్రభావమెక్కువ. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు మొదట్లో కాంగ్రెస్, తర్వాత సీపీఎం పక్షాన నిలిచారు. క్రమంగా ఆ రెండు పార్టీలు బలహీనపడటంతో.. తృణమూల్ వైపు వచ్చారు. ఇప్పుడు వాళ్లే తృణమూల్ కి ప్రధాన ఓటు బ్యాంక్. అయితే.. హిందుత్వ నినాదంతో హిందువుల ఓట్లతో బీజేపీ బలపడుతోందని తృణమూల్ కలవరపడుతోంది.

బెంగాల్ పై మోడీ, షా ప్రత్యేక దృష్టి

2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 281 సీట్లు సాధించి సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం హిందీ హర్ట్ ల్యాండ్ లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ 90 నుంచి 100 శాతం సీట్లను గెలుచుకుంది. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదు కాబట్టి తూర్పు వైపు కన్నేసింది. 42 సీట్లున్న బెంగాల్ పై అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నెలకోసారి బెంగాల్ లో పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం పెంచుతున్నారు. 2019 ఎన్ని కల్లో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో అడుగులు వేస్తున్నా రు. బెంగాల్‌‌‌‌లో ఎదురులేని శక్తిగా నిలవాలంటే హిందువుల ఓట్లను మొత్తం తమవైపు తిప్పుకోవడమే మార్గమని బీజేపీ చూస్తోంది. బెంగాల్ లో గత ఏడాది దుర్గా మాత నిమజ్జన కార్యక్రమం.. ఎన్నడూ లేనివిధంగా రాజకీయ రంగు పులుముకుంది. ఇతర పండుగలకు అనుమతిచ్చిన మమతా సర్కార్ దుర్గా మాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి మాత్రం కొన్ని ఆంక్షలు పెట్టింది. వీహెచ్ పీ నేతలు హైకోర్టుకు వెళ్లి మరీ నిమజ్జనం ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దుర్గా మాత విగ్రహాల నిమజ్ఞనం శాంపిల్‌‌‌‌ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా ముందుందని అప్పుడే టీఎంసీకి రాజకీయంగా బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థా నాలను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి 20కిపైగా సీట్లు సాధించాలని వ్యూహం రచిస్తోంది.

అయితే.. బెంగాల్ లో బీజేపీ క్యా డర్ జోరుమీదున్నా.. పార్టీని నడిపించే నేతలు కంటికి కనిపించడం లేదు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రిమో, రాజ్యసభ ఎంపీ రూపా గంగూలీ మాత్రమే.. కాస్త పేరున్న లీడర్లు. మమతను ఢీకొట్టే దమ్ము వీళ్లకు లేదు. ఆ స్థా యి నేతలు లేకపోవడం మైనస్. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసబెట్టి ఆందోళనలు చేస్తున్నా..ఆ టెంపోని ఓట్లుగా మలిచే నేత ప్రస్తుతం బీజేపీకి చాలా అవసరం. అయితే బెంగాల్ లో బలపడాలని చూస్తోన్న బీజేపీకి.. సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన చందన్ మిత్రా.. బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీకి సన్నిహితుడిగా మిత్రాకు గుర్తింపు ఉంది.

వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్థితి ఏంది?

ఒకప్పుడు బెంగాల్ అంటే లెఫ్ట్ …. లెఫ్ట్ అంటే బెంగాల్ లా నాటుకుపోయిన కమ్యూనిస్టుల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. 35 సంవత్సరాల పాటు ఏకబిగిన అధికారాన్ని అనుభవించి దేశంలో రికార్డు సృష్టించిన సీపీఎం ఓటు బ్యాంక్ చెదిరిపోతోంది. 2011లో అధికారం కోల్పోయిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల ఓట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు గెలుచుకున్న సీపీఎం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. నిజానికి 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసినా సీపీఎంకు కేవలం 26 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 44 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా కొట్టేసింది. కమ్యూనిస్టులకు ప్రధాన ఓటు బ్యాంక్ అయిన హిందువులను బీజేపీ తన వైపుకు మళ్లించుకుంటోంది. బెంగాల్ లో గత వైభవాన్ని నిలబెట్టుకోవడం ఎలా అన్నదే కమ్యూనిస్టులను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న.

ఇక, 2009 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీతో పొత్తుతో 6 సీట్లు సాధిం చిన కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 4 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మమతతో దోస్తీ చేస్తుండగా.. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆమెతో కుస్తీ పడుతోంది. మొత్తానికి రాష్ట్రంలో వేగంగా ఎదుగుతున్న బీజేపీని, ఇటు అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తంటాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు చివరి నిమిషంలో కుదిరినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నా రు. కాంగ్రెస్, లెఫ్ట్ ల మధ్య పొత్తు కుదరకుంటే రాష్ట్రం లో చతుర్ముఖ పోటీ తప్పదు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీఎంసీనే లాభపడే అవకాశముంది.

Latest Updates