సహజ రంగుల్లో తెలంగాణ వినాయకుడు!

వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నట్టే ఎన్నో రూపాలున్నాయి. అవన్నీ కళాకారులు తమ నేటివిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నం (ప్రయోగం) వల్ల జరిగింది. ఇక్కడ చూస్తున్నది తెలంగాణ వినాయకుడిని. ఈ ప్రయోగం చేసిన కళాకారుడు విజయ్‌‌ బెల్దె. సిద్దిపేటకు దగ్గర్లో ఉన్న ప్రజ్ఞాపూర్‌‌ వాళ్ల ఊరు. తను పెరిగిన ఊళ్లలో మనుషుల కట్టుబొట్టుతో వినాయకుడిని కాన్వాస్‌‌ మీదకు తీసుకొచ్చిండు. సహజ రంగులతో చేసిన మన చేనేత పంచెలు కట్టిండు ఈ వినాయకుడు.

చాలా చిత్రాల్లో వినాయకుడు గోధుమ రంగు చర్మంతో ఉంటాడు. ఇండియన్‌‌ స్కిన్‌‌లా నల్లగా, చామన ఛాయలో ఉన్నాడు ఈ గణపతి. ‘దైవం మానవ రూపంలో’ అన్నట్లుగా చిత్రించిన ఈ పెయింటింగ్స్‌‌లో ఆధ్యాత్మిక చింతన పురాణాలంత ఎక్కువగా ఉంది.
దేవతలు యోగా ప్రాక్టీస్‌‌ను చెప్పే ‘క్రియా యోగ’లో వినాయకుడిని దర్శించవచ్చు.

అలాగే సిద్ధులు, యోగులు, మునులు, రుషులు దైవ శక్తిని చేరేందుకు (కనెక్ట్‌‌ అయ్యేందుకు) ప్రాక్టీస్‌‌ చేసే పూజల్లోని ముద్రలన్నింటినీ ఒక సిరీస్‌‌గా విజయ్‌‌ పెయింటింగ్స్‌‌ గీశాడు. దత్తాత్రేయ పురాణాన్ని అధ్యయనం చేసి, అందులోని వినాయకుడికి విశేషాలన్నింటినీ రంగుల్లోకి తీసుకొచ్చిండు. కొన్ని దశాబ్దాలుగా గీసిన ఈ చిత్రాల్లో వినాయకుడి జీవిత ఇతివృత్తాన్ని, శివ తత్వాన్ని చూడొచ్చు.

విజయ్‌‌ బెల్దె జేఎన్‌‌టీయూలో బీఎఫ్‌‌ఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్రియేటివ్​ ఆలోచనలతో త్రీడీ యానిమేటర్‌‌గా సినిమా, టీవీ కార్యక్రమాలు రూపొందించాడు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి హార్టికల్చర్‌‌, బతుకమ్మ అవార్డులు గెలుచుకున్నాడు. ఆర్ట్‌‌ రెవల్యూషన్‌‌ తైపీ (తైవాన్‌‌) అవార్డునూ  అందుకున్నాడు.

Latest Updates