పళ్లుతోముతూ బ్రష్‌ మింగిండు.. 30 నిమిషాలు సర్జరీ చేసి తీసిన డాక్టర్లు

అరుణాచల్ ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. పసీఘాట్‌కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి.. బ్ర‌ష్ చేసుకునేటప్పుడు అనుకోకుండా 19 సెంటీమీటర్ల టూత్ బ్రష్ మింగివేసాడు. సెప్టెంబర్ 15 న రోయింగ్ లోయర్ దిబాంగ్ వ్యాలీలో ఈ సంఘ‌ట‌న‌ జరిగింది. బ్రష్ చేసుకుంటున్న స‌మ‌యంలో చేయిజారి గొంతులోకి జారిపోయింది. దీంతో దాన్ని బయటకు ఎలా తీయాలో అర్థం కాక వెంట‌నే సమీప‌ హాస్పిటల్‌కు వెళ్లాడు. అయితే అక్కడి వైద్యులు బకిన్ పెర్టిన్ జనరల్ హాస్పిటల్‌‌కు వెళ్లాలని సూచించారు.

డాక్ట‌ర్లు బాధితుడికి ఎక్స్‌రే తీయ‌గా.. అది అన్నవాహికలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళ్లిపోయి ఉండవచ్చని భావించారు. బ్రష్ మింగిన తర్వాత త‌న‌కు ఎలాంటి సమస్య రాలేదని , పొత్తికడుపు పైన కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు బాధితుడు చెప్పాడు. దీంతో బ్రష్ అక్కడే ఉండి ఉండవచ్చని వైద్యులు నిర్ధరించుకున్నారు.

బాధితుడికి అనస్థీషియా ఇచ్చి దాదాపు 30- 35 నిమిషాలు పాటు స‌ర్జ‌రీ చేసి అతని పొత్తికడుపు నుండి టూత్ బ్రష్ ను తీశామ‌ని డాక్టర్ బోమ్నీ తయేంగ్ తెలిపారు.

 

Latest Updates