బిగ్ బ్యాంగ్: అరుణ్ కుమార్ వ్యాసాల సంపుటి  .. విజ్ఞాన వారధి  విజయ సారథి

బిగ్ బ్యాంగ్: అరుణ్ కుమార్ వ్యాసాల సంపుటి  .. విజ్ఞాన వారధి  విజయ సారథి

మహనీయుల విజయ గాథలు, చైతన్యవంతమైన కథనాలతో నేటి తరానికి విజ్ఞాన వారధిగా, విజయ సారధిగా ఫిజిక్స్ అరుణ్ కుమార్ రాసిన వ్యాసాల సంపుటి “బిగ్ బ్యాంగ్”. వర్ధమాన కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ హేతుబద్ధ కవిత్వంతో వెలువరించిన  తన తొలి కవితా సంపుటి ‘శూన్యం’ తరువాత  ఈ సంపుటిని తీసుకొచ్చారు. వర్తమానంలో జరుగుతున్న అనేక సామాజిక విషయాలతో పాటు, అందులో దాగివున్న తార్కికతపై  తనదైన ‘ ఫిజిక్స్’ శైలిలో స్పందిస్తూ రాసిన వ్యాసాల సంగ్రహణమే ఈ పుస్తకం. 

అరుణ్ కుమార్ రాసిన అనేక వ్యాసాలలోంచి ఏరి కోరి అచ్చేయించిన ఈ సంపుటిలో “నా మతం సైన్స్. నేను దాన్ని ఆరాధిస్తాను” అన్న భారతరత్న సి.వి రామన్ ‘రామన్ ఎఫెక్ట్’, అలాగే గణిత మేధావి శ్రీనివాస  రామానుజన్ సంఖ్య 1729ను గౌరవ సూచకంగా ప్రతి పేజీ హెడర్‌లో ఉంచడం అరుణ్ కుమార్‌కు విజ్ఞాన శాస్త్రం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ను యావత్ ప్రపంచం గుర్తించాకే మన దేశం గుర్తించింది అనే విషయాన్ని ‘విశ్వమంతా గణితమ(మా)యం’ అనే వ్యాసంలో తెలిపారు. 

“ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్ఫటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే విజ్ఞానం అత్యుత్తమమైన, సృజనాత్మక కళారూపం” అంటారు అరుణ్​. నిరంతర పరిశ్రమ స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్రాన్ని   మదించి వేస్తాయన్న సి.వి రామన్ మాటలను ‘విశ్వ మానవాళి సంక్షేమం సైన్స్’లో ఉటంకించారు. 

ఆసియా ఖండంలోనే ఫిజిక్స్ విభాగంలో తొలి నోబెల్ సాధించి, భారతీయ మేధాశక్తిని  ప్రపంచానికి చాటిన భారత రత్న సి.వి రామన్ గురించి వివరంగా తెలియజేశారు. 

చెట్లు మనకు ప్రాణ వాయువును అందించినట్లే... మంచి పుస్తకాలు మంచి ఆలోచనలను పొందిస్తాయని.. పుస్తకాల విశిష్టతను తెలియజేశారు. పేపర్‌బాయ్ నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగిన  డా. అబ్దుల్ కలాం రచనలు నేటి తరం చదవాల్సిన పుస్తకాలని, జీవిత పాఠాలను నేర్పిన పుస్తకాలే మన నేస్తాలని రచయిత చెప్తారు. 

“ప్రజలను మార్చడమే విద్య ఉద్దేశం’’ అన్న డా. బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తితో కూడా ఒక వ్యాసం రాశారు. ‘చిరునవ్వు చిందిస్తూ.. స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ..’ అనే వ్యాసం ద్వారా కేవలం ఎనిమిది రోజులు రోదసియాత్రకు బయలుదేరి, సాంకేతిక సమస్యలతో అనూహ్య పరిణామాల మధ్య 288 రోజులు అక్కడే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల ధైర్య సాహసాలను తెలియజేశారు. 

భారతదేశంలో అంచెలంచెలుగా ఎదిగిన ఇస్రో పరిణామక్రమం ‘ఇస్రో  విన్నింగ్ సెంచరీ’ వ్యాసం ద్వారా మనకు అవగతం అవుతుంది. సైకిల్‌పై, ఎద్దుల బండ్లపై రాకెట్‌ల విడిభాగాలను మోసుకెళ్లిన స్థాయి నుండి  ఒకే ప్రయోగంలో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగిన విధానాన్ని చక్కగా వివరించారు రచయిత అరుణ్ కుమార్. 

‘ఆర్యభట్ట @50’లో భారతదేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ 1975 ఏప్రిల్ 19న ప్రయోగించి 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆనాటి పరిస్థితిని, అప్పటినుంచి దేశం ఎదిగిన తీరు, ప్రస్తుత స్థితి, భవిష్యత్ ప్రణాళిక లాంటి విషయాలు తెలియపరిచారు. 

భారతదేశం ప్రపంచ విజ్ఞానానికి గణితం, వైద్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం అందించిన విధానాన్ని, భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, వరాహమీర, భాస్కర తదితర విశిష్ట ప్రజ్ఞావంతుల గురించి తెలియజేశారు. 

ఈ వ్యాసాల సంపుటిలో కొన్ని సామాజిక కోణాలను రచయిత తడిమారు. మనందరిలో ఓ సచిన్ ఉంటాడు’ అంటూ ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం అంటూ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని ప్రేరణగా చెప్తారు. హిందూ ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ‘పచ్చడి @ ఖుర్మాపాయసం’లో రోజు తేడాలోనే వచ్చిన ఉగాది, రంజాన్ పండుగల విశిష్టతలను చెప్పారు.

 ‘బీసీల ఐక్యత, వివేకానంద స్వప్నం, 2025వ సంవత్సరాన్ని స్వాగతిస్తూ ‘నవోదయం వైపుగా 2025’ లాంటి వ్యాసాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. నేటి సమాజంలో విద్యావంతులందరికీ ఈ ‘బిగ్ బ్యాంగ్’ విజ్ఞాన వారధిగా, విజయ సారధిగా ఉంటుంది.

- వినోద్ కుత్తుం-

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com