నామినేషన్‌ వేయలేకపోయిన కేజ్రీవాల్‌

ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ(సోమవారం) నామినేషన్ వేయలేకపోయారు. భారీ రోడ్ షో కారణంగా కేజ్రీవాల్ సకాలంలో నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేక పోయారు. ఇదే విషయంపై మాట్లాడిన ఆయన రేపు(మంగళవారం) నామినేషన్ వేస్తానని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు కూడా రేపే చివరి రోజు. నామినేషన్ వేయడానికి సయమం మించిపోతోందని తన మనుషులు తనకు చెప్పారని… కానీ తన కోసం వచ్చిన ఇంత మందిని వదిలి ఎలా వెళ్లగలనని ఆయన మీడియాను ప్రశ్నించారు.

ఢిల్లీలోని ప్రఖ్యాత వాల్మీకి మందిర్ నుంచి కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభించారు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వరకు రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఉన్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలను ఆప్ గెలిచింది. 54.3 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. ఈసారి మొత్తం సీట్లను గెలుచుకుంటామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు 24 మంది కొత్త అభ్యర్థులను ఆప్ బరిలోకి దింపింది.

Latest Updates