ఆర్యసమాజ్‌ నేత స్వామి అగ్నివేశ్‌  కన్నుమూత

ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ బిలియరీ సైన్సెస్‌ (ILBS) లో మంగళవారం( సెప్టెంబర్ -8) నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ(శుక్రవారం,సెప్టెంబర్ -11) సాయంత్రం 6.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

1939 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు స్వామి అగ్నివేశ్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఆయన… తాత దగ్గర పెరిగారు. కోల్ కతాలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్ లో పట్టా పొందారు. ఆ తర్వాత 1970 లో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించిన స్వామి అగ్నివేశ్… ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్యసభ పార్టీని నడిపారు.1977లో హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Latest Updates