మేఘాలు కన్ఫ్యూజ్‌‌‌‌ చేస్తున్నయి

  • అందుకే వాతావరణ అంచనాలు తప్పయితున్నయ్‌‌‌‌
  • గ్లోబల్‌‌‌‌ వార్మింగ్‌‌‌‌ కూడాఇంకో ప్రాబ్లమైపోయింది
  • ఈసారి వర్షాలు సాధారణమన్న ఐఎండీ.. దంచికొట్టిన వానలు
  • పరిశీలన స్థాయి పెరగాలంటున్న సైంటిస్టులు

దేశంలో ఈసారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంతో పోలిస్తే 94 శాతం వర్షమే పడుతుందని చెప్పి తర్వాత దాన్ని 99 శాతానికి అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసింది. కానీ ఐఎండీ ఒకటి చెబితే ఇంకొకటి జరిగింది. వానలు దంచికొట్టాయి. గత 25 ఏళ్ల రికార్డును తిరగరాశాయి. సాధారణం కన్నా 10 శాతం ఎక్కువ పడ్డాయి. వానల వల్ల 2,100 మంది చనిపోయారు. 46 మంది గల్లంతయ్యారు. 22 రాష్ట్రాల్లో 25 లక్షల మంది ప్రభావితమయ్యారు. అసలు వాతావరణ శాఖ అంచనా ఎందుకు తలకిందులైంది. వాడుతున్న పద్ధతి తప్పా? తీసుకుంటున్న లెక్కలు తప్పా? చేస్తున్న పరిశీలన తప్పా? అంటే ఐఎండీ వాడుతున్న పద్ధతులు అంత కచ్చితమైన సమాచారం ఇవ్వకపోయినా అంతకుమించిన సమస్య మేఘాలతోనని తెలిసింది. అవి కన్ఫ్యూజ్‌‌‌‌ చేస్తుండటంతోనే అంచనాలు మారిపోతున్నాయని తేలింది.

మేఘాల్లో హాట్‌‌‌‌, కూల్‌‌‌‌

సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమి మీద పడకుండా మేఘాలు ఆపి వెనక్కి పంపిస్తాయి. అలాగే భూమి నుంచి వచ్చే వేడిని గ్రహించి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. మేఘాల సైజు, వాటి ఎత్తును బట్టి ఈ పరిణామాలు మారుతుంటాయి. తక్కువ సైజు, ఎక్కువ ఎత్తులో ఉండే సిర్రస్‌‌‌‌ రకం మేఘాలు తక్కువ సూర్యరశ్మిని వాతావరణంలోకి పంపుతాయి. థర్మల్‌‌‌‌ రేడియేషన్‌‌‌‌ను బాగా గ్రహిస్తాయి. కాబట్టి ఇవి వేడయ్యే మేఘాలు. ఎక్కువ దట్టంగా, తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు సూర్యుడి నుంచి వచ్చే వేడిని తిరిగి వాతావరణంలోకి పంపడంలో బాగా పని చేస్తాయి. భూమి నుంచి వచ్చే వేడిని మాత్రం తక్కువ గ్రహిస్తాయి. ఇవి కూల్‌‌‌‌ మేఘాలు. కొన్ని రకాల మేఘాలు తటస్థంగా కూడా ఉంటాయి. మామూలుగా మేఘాల వేడి, చల్లదనం, సైజు, ఎత్తు బట్టి వాతావరణ అంచనాలు ఉంటాయి. కానీ ప్రస్తుత గ్లోబల్‌‌‌‌ వార్మింగ్‌‌‌‌ వల్ల మేఘాలపై ప్రభావం ప్రస్తుత వాతావరణ మోడల్స్‌‌‌‌కు చిక్కులు తెస్తోంది. మేఘాలపై గ్లోబల్‌‌‌‌ వార్మింగ్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ను సరిగ్గా కనుగొని మోడల్స్‌‌‌‌తో అంచనాలు చేస్తే చాలా వరకు మంచి ఫలితాలొస్తాయని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు.

మూడు నెలల అంచనా కష్టం

మేఘాల స్టడీతో పాటు ప్రాంతీయ కంప్యూటర్‌‌‌‌ సిములేషన్స్‌‌‌‌ను గ్లోబల్‌‌‌‌ క్లైమేట్‌‌‌‌ మోడల్స్‌‌‌‌కు జోడించి అంచనాలు వేస్తుంటారని ఇటీవల ఓస్టడీలో తెలిసింది. దీంతో అంచనాలు తప్పవుతున్నాయని వెల్లడైంది. మేఘాలు ఎలా మారుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయో శాటిలైట్‌‌‌‌ ఫొటోలతో తెలుసుకుంటున్నా కేవలం వాటిపైనే ఆధారపడి అంచనాలు వేయలేమని సైంటిస్టులు అంటున్నారు. మేఘాలూ తరచూ మారుతుంటాయని, వాతావరణం కూడా మారుతుంటుందని చెబుతున్నారు. అలాగే మేఘాల వ్యాప్తితో పాటు గాలి ప్రసారం కూడా వర్షపాత పరిస్థితులను ప్రభావితం చేస్తుంటాయని అంటున్నారు. పైగా వారానికి మించి వాతావరణ పరిస్థితులను ప్రస్తుతం అంచనా వేయలేకపోతున్నామని, కాబట్టి 120 రోజులు మాన్‌‌‌‌సూన్స్‌‌‌‌ను అంచనా వేయడం కష్టమైన పని అని చెబుతున్నారు. భూమిపైన, శాటిలైట్లతో మేఘాల లక్షణాలను ఎంత బాగా పరిశీలిస్తే అంత కచ్చితంగా అంచనాలు వేయగలుగుతామని.. అందుకోసం ఎక్కువ శాటిలైట్లు, గ్రౌండ్‌‌‌‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరిస్తున్నారు.

As the clouds confuse, expectations change: report

Latest Updates