ఇండియా టాప్‌‌ ట్రేడ్‌‌ పార్ట్‌‌నర్‌‌ అమెరికానే

న్యూఢిల్లీ: చైనాను దాటేసి యూఎస్‌‌ ఇండియాకు టాప్‌‌ ట్రేడింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌గా మారింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడ్డాయనే దానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కామర్స్‌‌ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2018–19లో యూఎస్‌‌–ఇండియాల మధ్య వాణిజ్యం 87.95 బిలియన్‌‌ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో చైనాతో ఇండియా వాణిజ్యం 87.07 బిలియన్‌‌ డాలర్లుగా నమోదైంది. ఇక ఏప్రిల్‌‌– డిసెంబర్‌‌ 2019 మధ్య కాలంలోనూ యూఎస్‌‌–ఇండియాల మధ్య వాణిజ్యం 68 బిలియన్‌‌ డాలర్లు దాటింది. ఈ కాలానికి 64.96 బిలియన్‌‌ డాలర్లతో చైనా రెండో ప్లేస్‌‌లో నిలిచింది. రాబోయే ఏళ్లలోనూ ఇదే ట్రెండ్‌‌ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య సంబంధాలు మరింత పెరిగేలా అమెరికా–ఇండియాలు ప్రయత్నాలు చేస్తుండటమే కారణంగా చెబుతున్నారు.

ఫ్రీ ట్రేడ్‌‌ ఎగ్రిమెంట్‌‌ (ఎఫ్‌‌టీఏ) కనక కుదిరితే రెండు దేశాల మధ్య వాణిజ్యం కొత్త ఎత్తులకు చేరుతుందని ఒక నిపుణుడు పేర్కొన్నారు. ఇండియాలో తయారయ్యే వస్తువులకు, సేవలకు యూఎస్‌‌ పెద్ద మార్కెట్‌‌ కాబట్టి, సహజంగానే ఇండియాకు ఎఫ్‌‌టీఏ ప్రయోజనకరంగా ఉంటుందని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ ఆర్గనైజేషన్స్‌‌ (ఎఫ్‌‌ఐఈఓ) డైరెక్టర్‌‌ జనరల్‌‌ అజయ్‌‌ సహాయ్‌‌ అన్నారు. యూఎస్‌‌తో ఇండియా ఎగుమతులు, దిగుమతులు రెండూ పెరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు చైనాతో రెండూ తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఇండియాకు ట్రేడ్‌‌ సర్‌‌ప్లస్‌‌ ఉన్న అతి కొద్ది దేశాలలో అమెరికా కూడా ఒకటి. అదే చైనాతోనైతే వాణిజ్య లోటు చాలా ఎక్కువ. 2018–19 లో అమెరికాతో వాణిజ్యంలో ఇండియాకు 16.85 బిలియన్‌‌ డాలర్ల ట్రేడ్‌‌ సర్‌‌ప్లస్‌‌ నమోదైంది. చైనాతో మాత్రం 53.56 బిలియన్‌‌ డాలర్ల భారీ వాణిజ్య లోటు నమోదవడం గమనార్హం. 2013–14 నుంచి 2017–18 దాకా చైనాయే ఇండియాకు అతి పెద్ద ట్రేడ్‌‌ పార్ట్‌‌నర్‌‌.

అంతకు ముందు చూస్తే యూఏఇ అతి పెద్ద ట్రేడ్‌‌ పార్ట్‌‌నర్‌‌. అమెరికా–ఇండియాల మధ్య ట్రేడ్‌‌ వివాదాలు పోవాలంటే ఎఫ్‌‌టీఏనే సరైన పరిష్కారమని అమెరికాలోని ప్రముఖ బిజినెస్‌‌ ఏడ్వోకసీ గ్రూప్‌‌ చెబుతోంది. టారిఫ్‌‌లు, ఇండియన్‌‌ ప్రొఫెషనల్స్‌‌ అంశాలు సహా అన్నీ సమసిపోవాలంటే ఫ్రీ ట్రేడ్‌‌ ఎగ్రిమెంటే కీలకమని ఆ గ్రూప్‌‌ పేర్కొంటోంది. యూఎస్‌‌తో ఒప్పందం విషయంలో వ్యవసాయం, ఆహారోత్పత్తులు వంటి అంశాలలో ఇండియా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఫారిన్‌‌ ట్రేడ్‌‌ (ఐఐఎఫ్‌‌టీ) ప్రొఫెసర్‌‌ రాకేష్‌‌ మోహన్‌‌ జోషి చెప్పారు. మొక్కజొన్న, సోయాబీన్‌‌ వంటి కమోడిటీస్‌‌ను అమెరికా భారీగా ఉత్పత్తి చేస్తుండటమే దానికి కారణంగా తెలిపారు. కిందటేడాది అమెరికాకు  మొత్తం 22.7 బిలియన్‌‌ డాలర్ల విలువైన  స్టీలు, స్టీలు ప్రొడక్ట్స్‌‌, అల్యూమినియం ప్రొడక్ట్స్‌‌ సహా వివిధ ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతయ్యాయి.

Latest Updates