దేశం నుంచి తమను వేరు చేయలేరు: అసదుద్దీన్ ఓవైసీ

CAAపై ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. దేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. ముస్లిం JAC హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించింది.

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి  వ్యతిరేకంగా హైదరాబాద్ లో ర్యాలీ తీశారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని, CAA, NRC, NPRకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ జరిగింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తో పాటు  ముస్లిం ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

CAA ను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ముస్లింలంతా సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. భారతీయులంతా ఒక్కటేనన్న ఆయన…తమను ఎవరూ మాతృభూమి నుంచి వేరు చేయలేరన్నారు.ఈ నెల 25న అర్ధరాత్రి చార్మినార్ దగ్గర రిపబ్లిక్ డే ను సెలబ్రేట్ చేసుకుంటామన్నారు. 12 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. 30న మహాత్మ గాంధీ వర్ధంతి రోజు బాపూఘాట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రదర్శన ముగిసిన తర్వాత శాస్త్రీపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు అసదుద్దీన్.

ర్యాలీ జరిగిన ప్రాంతాల్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ర్యాలీ మొత్తం వీడియో తీశారు. ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో బంద్ పాటించారు ముస్లింలు.

అంతకుముందు ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు బహదూర్ పురకు చెందిన నందరాజ్. పిటిషన్ ను విచారించిన హైకోర్టు … పోలీసులు అనుమతి ఇచ్చిన వరకే ర్యాలీ నిర్వహించాలని సూచించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది. ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. అయితే జనానికి మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మరోవైపు CAAపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తూ  ర్యాలీలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. కారు స్టీరింగ్ మా చేతిలో ఉందంన్నారు.

Latest Updates