అయోధ్య తీర్పుపై ఒవైసీ అసంతృప్తి

  • ఆ ఐదెకరాల భూమి దానంగా అక్కర్లేదు
  • తమ పోరాటం చట్టబద్ధమైన హక్కు కోసమని ప్రకటన
  • సుప్రీం కోర్టు అత్యున్నతమైనదే కానీ.. అమోఘమైనది కాదు
  • అయోధ్య తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అసదుద్దీన్

హైదరాబాద్: అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు చెబుతూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు అత్యున్నతమైనదే కానీ, అమోఘమైనది కాదని అన్నారాయన. గతంలోనే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ స్వయంగా ఈ మాట అన్నారని చెప్పుకొచ్చారు ఒవైసీ. పొరబాట్లు జరగొచ్చని, రివ్యూకు వెళ్లే హక్కు తమకు ఉందని అన్నారు. రాజ్యాంగంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు.

అయోధ్య కేసులో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి ఇస్తూ.. మసీదు కట్టడానికి అయోధ్యలోనే మరోచోట ఐదెకరాల భూమి కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు పూర్తిగా నిజాలపై మత విశ్వాసం సాధించిన విజయమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము చట్టబద్ధంగా రావాల్సిన హక్కు కోసం పోరాడుతున్నామని, ఈ ఐదెకరాల భూమి డొనేషన్ తమకు అక్కర్లేదని చెప్పారు. తమపై దయ చూపాల్సిన పనిలేదన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూలగొట్టలేదని సుప్రీం కోర్టు చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారాయన.

కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది

అన్ని రాజకీయ పార్టీలు తమను మోసం చేశాయని ఒవైసీ అన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ చెప్పాడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ పార్టీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని, ఆ పార్టీ పూర్తిగా నాశనమైపోవాలని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మోసపూరిత బుద్ధిని మరోసారి భయటపెట్టుకున్నారని అన్నారాయన. 1992లో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు తన డ్యూటీని కరెక్ట్‌గా చెసి ఉంటే ఈ రోజుకీ అక్కడ బాబ్రీ మసీదు ఉండేదని ఒవైసీ అన్నారు. ఇప్పుడు సుప్రీం తీర్పును బీజేపీ, ఆరెస్సెస్ తమ విషపూరిత అజెండాను అమలు చేయడానికి వాడుకుంటాయని ఆరోపించారు.

Latest Updates