మజ్లిస్ హైదరాబాద్‌ వరకే పరిమితం కాదు

  • దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నం: అసదుద్దీన్
  • తాము పోటీలో ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పరేషానైతున్నయని ఎద్దేవా

కామారెడ్డి, వెలుగు: ‘హైదరాబాద్‌కే మజ్లిస్ పరిమితమని కొందరు ప్రచారం చేస్తున్నరు. మాది రాష్ట్ర పార్టీ. దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నం. మూడు ఎంపీ స్థానాలు గెలిచినం’ అని ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తాము పోటీలో ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌ పరేషాన్‌ అయితున్నయని ఎద్దేవా చేశారు. మున్సిపోల్స్‌ ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో ఒవైసీ మాట్లాడారు. సీఏఏను నిరసిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మున్సిపోల్స్‌లో పెద్ద ఎత్తున ఓట్లేయాలని ప్రజలను కోరారు. సీఏఏపై మున్సిపోల్స్‌ను బీజేపీ రెఫరెండంగా భావించాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 25 మంది ముస్లింలను యోగి ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని, ఇప్పటివరకు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకించిన వాళ్లను బీజేపీ టెర్రరిస్టులుగా చూస్తోందని అసద్‌ ఆరోపించారు. దళితుల వద్ద, నిరుపేదల వద్ద పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఉండవన్నారు. హైదరాబాద్‌లో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తాము తిరంగ్ ర్యాలీ నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో జనం వచ్చారని గుర్తు చేశారు. ‘అసదుద్దీన్ వెళ్లిన చోట కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోందని కొందరు భయపడుతున్నారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యులర్ పార్టీనా? అమేథిలో రాహుల్‌గాంధీ ఎందుకు ఓడిపోయారు? లీడర్‌ను కాపాడుకోలేని వాళ్లు నాతో ఏం పోరాడతారు’ అన్నారు. బీహార్‌లో నితీశ్‌ పార్టీని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించింది తమ పార్టీయేనని, అందుకు థ్యాంక్స్‌ చెప్పకుండా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

asaduddin owaisi speech at Kamareddy on Saturday as part of the municipal campaign

Latest Updates