సెంచరీతో ఆసీస్‌‌ను ఆదుకున్న స్మిత్‌‌

  • తొలి ఇన్నింగ్స్‌‌లో 284 ఆలౌట్‌‌
  • చెలరేగిన బ్రాడ్‌‌, వోక్స్‌‌

యాషెస్‌‌లో అసలు సిసలు సమరం తొలి రోజే కనిపించింది..!  ఓ దశలో ఇంగ్లండ్‌‌ పేసర్ల దెబ్బకు ఆసీస్‌‌ కుదేలైతే.. మరో దశలో మాజీ కెప్టెన్​ స్టీవ్‌‌ స్మిత్‌‌ (219 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 144) చేసిన ఒంటరి పోరాటం ఇంగ్లిష్ టీమ్‌‌ను కలవరపెట్టింది..! ఆరంభంలో ఆతిథ్య బౌలర్ల దాటికి.. 7.3 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 2/17.. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన  స్మిత్‌‌ లంచ్‌‌ వరకు స్కోరును 83/3 తీసుకెళ్లాడు..! బ్రాడ్‌‌ (5/86), వోక్స్‌‌ (3/58) బౌలింగ్‌‌ను చూస్తే..  మహా అయితే మరో సెషన్‌‌.. లేదంటే నూటయాభైలోపు ఆలౌట్‌‌ అనుకున్నారు..! అనుకున్నట్లుగానే రెండో సెషన్‌‌ మధ్యలో ఆసీస్‌‌ స్కోరు 122/8..! ఇక కంగారూల పని ఖతం అనుకుంటున్న తరుణంలో..  స్మిత్‌‌ బ్యాట్​ ఝుళిపించాడు. సహచరులు పెవిలియన్‌‌కు క్యూ కట్టినా.. గ్రౌండ్‌‌లో ఇంగ్లండ్​ ఫ్యాన్స్​ వెక్కిరించినా.. తాను మాత్రం సూపర్‌‌ సెంచరీతో ఆసీస్‌‌ను ఒడ్డున పడేశాడు..!

బర్మింగ్‌‌హామ్‌‌: యాషెస్‌‌ తొలి టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. హోమ్‌‌ టీమ్‌‌ బౌలర్ల జోరుకు ఆరంభంలో తలవంచినా.. ఆఖర్లో మాత్రం పైచేయి సాధించింది. స్మిత్‌‌కు తోడుగా సిడిల్‌‌ (44), హెడ్‌‌ (35) మాత్రమే నిలకడ చూపడంతో గురువారం తొలి రోజు ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 80.4 ఓవర్లలో 284 రన్స్‌‌కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 10 రన్స్‌‌ చేసింది. బర్న్స్‌‌ (4 బ్యాటింగ్‌‌), రాయ్‌‌ (6 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.

టాప్‌‌ లేపారు

టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్‌‌కు..  ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. ఇంగ్లిష్‌‌ పేసర్లు అండర్సన్‌‌,  బ్రాడ్‌‌ బంతిని స్వింగ్‌‌ చేస్తూ ఓపెనర్లు వార్నర్‌‌ (2), బాన్‌‌క్రాఫ్ట్‌‌ (8)ను ముప్పు తిప్పలు పెట్టారు.  బ్రాడ్‌‌ తన తొలి ఓవర్‌‌ తొలి బంతికే వార్నర్‌‌ను ఔట్‌‌ చేసినంత పని చేశాడు. అద్భుతమైన ఇన్‌‌స్వింగర్‌‌తో అతన్ని వికెట్ల ముందు పట్టేశాడు. కానీ ఫీల్డ్‌‌ అంపైర్‌‌ నాటౌట్‌‌ ఇవ్వడంతో ఇంగ్లండ్‌‌ రివ్యూకు వెళ్లి విఫలమైంది. బంతి బ్యాట్‌‌ను తాకినట్లు రిప్లేలో స్పష్టమైంది. అయినా వార్నర్‌‌ ఎంతోసేపు క్రీజులో ఉండలేకపోయాడు. నాలుగో ఓవర్‌‌ ఐదో బంతికి మళ్లీ బ్రాడ్‌‌కే దొరికాడు. దీంతో ఆసీస్‌‌ 2 పరుగులకే తొలి వికెట్‌‌ కోల్పోయింది. ఇంగ్లిష్‌‌ కండీషన్స్‌‌పై పట్టు ఉన్న బాన్‌‌క్రాఫ్ట్‌‌ రెండు ఫోర్లు బాది టచ్‌‌లోకి వచ్చినా.. బ్రాడ్‌‌ దెబ్బకు కుదేలయ్యాడు. ఎనిమిదో ఓవర్‌‌లో బ్రాడ్‌‌ వేసిన బౌన్సర్‌‌ను ఆడి ఫస్ట్‌‌ స్లిప్‌‌లో రూట్‌‌ చేతికి చిక్కాడు. ఖవాజ (13)తో జతకలిసిన స్మిత్‌‌ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాలి పిక్క గాయం మళ్లీ తిరగబెట్టడంతో అండర్సన్‌‌ 4 ఓవర్లు మాత్రమే వేసి స్కానింగ్‌‌ కోసం బయటకు వెళ్లిపోయాడు. వోక్స్‌‌ వచ్చి రావడంతోనే ఖవాజను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌‌ 35/3 స్కోరుతో కష్టాల్లో పడింది. స్మిత్‌‌, హెడ్‌‌  భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌‌తో నెట్టుకు రావడంతో ఆసీస్‌‌ 27 ఓవర్లలో 83/3 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది.

మిడిల్‌‌ ఢమాల్‌‌..

ఓ ఎండ్‌‌లో స్మిత్‌‌ స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్‌‌లో వరుస విరామాల్లో ఆసీస్​  ఐదు వికెట్లు చేజార్చుకుంది. విరామం నుంచి వచ్చిన తర్వాత వోక్స్‌‌, బ్రాడ్‌‌ మరింత రెచ్చిపోయారు. లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ మిస్‌‌ కాకుండా రెండు వైపుల స్వింగ్‌‌తో బెంబేలెత్తించారు. అవసరమైనప్పుడు బౌన్స్‌‌, షార్ట్‌‌ పిచ్‌‌లతో ముప్పేటా దాడి చేశారు. దీంతో ఐదు ఓవర్లు ఆడాడో లేదో హెడ్‌‌ వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌‌కు 64 పరుగులు జతకావడంతో ఆసీస్‌‌ కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. వేడ్‌‌ (1) ఔట్‌‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రెండు ఔట్ల మధ్యలో.. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్‌‌ రివ్యూలో సక్సెస్‌‌ అయ్యాడు. బ్రాడ్‌‌ వేసిన బంతిని ఆడకుండా వదిలేసే క్రమంలో వికెట్లపైకి దూసుకొచ్చింది. పైన్‌‌ (5) సపోర్ట్‌‌ ఇచ్చే ప్రయత్నం చేసినా.. స్టోక్స్‌‌, అలీ కూడా రన్స్‌‌ నిరోధించడంతో ఒత్తిడి ఎక్కువైంది. దీంతో స్వల్ప తేడాలో పైన్‌‌, పాటిన్సన్‌‌ (0), కమిన్స్‌‌ (5) పెవిలియన్‌‌కు చేరారు. వీళ్లందరూ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితంకావడంతో ఆసీస్‌‌ స్కోరు కష్టాలు కొనసాగాయి. ఈ క్రమంలో  స్మిత్‌‌ 119 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తానికి ఆసీస్‌‌ 154/8తో టీ విరామానికి వెళ్లింది.

స్మిత్‌‌ సెంచరీ

టీ తర్వాత వర్షం పడటంతో మూడో సెషన్‌‌ కాస్త ఆలస్యంగా మొదలైంది. తొలి సెషన్‌‌లో వచ్చిన స్మిత్‌‌ దాదాపు రోజంతా నిలకడగా బ్యాటింగ్‌‌ చేశాడు. ఇంగ్లండ్‌‌ బౌలర్లు ఎంత ఒత్తిడి పెంచినా.. సహచరులు పెవిలియన్‌‌ బాట పట్టినా.. తాను మాత్రం ఎక్కడా తడబడలేదు. సిడిల్‌‌ కూడా రెండో ఎండ్‌‌లో చాలా సమన్వయంతో ఆడాడు.  ఈ ఇద్దరు కలిసి ఇంగ్లండ్‌‌ బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టడంతో ఆసీస్‌‌ 65 ఓవర్లలో 200 స్కోరుకు చేరింది. దీటుగా ఆడుతున్న ఈ జంటను 68వ ఓవర్‌‌లో అలీ విడగొట్టాడు. టర్నింగ్‌‌ బంతిని ఆడబోయి షార్ట్‌‌ లెగ్‌‌లో బట్లర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి సిడిల్‌‌ ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య తొమ్మిదో వికెట్‌‌కు 79 రన్స్‌‌ సమకూరాయి. ఈ క్రమంలో స్మిత్‌‌ 184 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. లైయన్‌‌ (12 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించినా.. ఎక్కువగా స్ట్రయికింగ్‌‌ తీసుకున్న స్మిత్‌‌ భారీ షాట్లకు తెరలేపాడు. బ్రాడ్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. లైయన్‌‌తో ఆఖరి వికెట్‌‌కు 74 రన్స్‌‌ జోడించి ఆసీస్‌‌ను గట్టెక్కించాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌: బాన్‌‌క్రాఫ్ట్‌‌ (సి) రూట్‌‌ (బి) బ్రాడ్‌‌ 8, వార్నర్‌‌ (ఎల్బీ) బ్రాడ్‌‌ 2, ఖవాజ (సి) బెయిర్‌‌స్టో (బి) వోక్స్‌‌ 13, స్మిత్‌‌ (బి) బ్రాడ్‌‌ 144, హెడ్‌‌ (ఎల్బీ) వోక్స్‌‌ 35, వేడ్‌‌ (ఎల్బీ) వోక్స్‌‌ 1, పైన్‌‌ (సి) బర్న్స్‌‌ (బి) బ్రాడ్‌‌ 5, పాటిన్సన్‌‌ (ఎల్బీ) బ్రాడ్‌‌ 0, కమిన్స్‌‌ (ఎల్బీ) స్టోక్స్‌‌ 5, సిడిల్‌‌ (సి) బట్లర్‌‌ (బి) అలీ 44, లైయన్‌‌ (నాటౌట్‌‌) 12, ఎక్స్‌‌ట్రాలు: 15, మొత్తం: 80.4 ఓవర్లలో 284 ఆలౌట్‌‌.

వికెట్లపతనం: 1–2, 2–17, 3–35, 4–99, 5–105, 6–112, 7–112, 8–122, 9–210, 10–284.

బౌలింగ్‌‌: అండర్సన్‌‌ 4–3–1–0, బ్రాడ్‌‌ 22.4–4–86–5, వోక్స్‌‌ 21–2–58–3, స్టోక్స్‌‌ 18–1–77-–1, అలీ 13–3–42–1, డెన్లీ 2–1–7–0.

ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌: బర్న్స్‌‌ బ్యాటింగ్‌‌ 4, రాయ్‌‌ బ్యాటింగ్‌‌ 6, మొత్తం: 2 ఓవర్లలో 10/0.

బౌలింగ్‌‌: కమిన్స్‌‌ 1–0–3–0, పాటిన్సన్‌‌ 1–0–7–0.

Latest Updates