46 ఏళ్ల తర్వాత టైటిల్‌ నెగ్గిన ఆస్ట్రేలియన్

ashleigh-barty-wins-french-open-2019

ఎర్ర మట్టి కోటలో  కొత్త పొద్దు పొడిచింది. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ మహా సంగ్రామంలో సరికొత్త ఆధ్యాయం మొదలైంది. సంచలనాల మోత మోగుతూ.. మేటి ప్లేయర్లు మట్టికరుస్తూ ..  ఊహకందకుండా సాగిన మెగా టోర్నీలో  మహిళల సింగిల్స్‌‌‌‌ కిరీటం కొత్త అమ్మాయిని వరిచింది. రొలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లో ఆస్ట్రేలియా యువ సంచలనం ఆష్లే బర్టీ నయా చాంపియన్‌‌‌‌గా నిలిచింది. ఫేవరెట్లు చేతులెత్తేసిన చోట అనూహ్యంగా చెలరేగుతూ బర్టీతో పాటు ముందుకు సాగిన చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ టీనేజర్‌‌‌‌ మార్కెట్రా వొండ్రుసొవా ఆఖరి మెట్టుపై పట్టు విడిచింది.  తిరుగులేని ఆటతో మార్కెట్రాను చిత్తు చేసిన బర్టీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరాటలో ఓడినా అంచనాలే లేకుండా ఇంతదూరం వచ్చిన వొండ్రుసొవాకు రన్నరప్‌‌‌‌ టైటిలే కిరీటం అంత ఆనందాన్నిచ్చింది.

పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం 46ఏళ్లుగా వేచిఉన్న ఆస్ట్రేలియా ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో ఆసీస్‌ యువతార చెందిన ఆష్లే బర్టీ… చెక్‌ రిపబ్లిక్‌ టీనేజర్‌ మార్కెటా వొండ్రుసొవాను చిత్తుగా ఓడించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకుంది.పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్‌లో ఎనిమిదో సీడ్‌ బర్టీ 6–1, 6–3తో మార్కెటాపై సునాయాసంగా గెలిచింది. 70 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన బర్టీ  కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 1973లో మార్గరెట్ కోర్ట్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియన్‌గా నిలిచింది. ఈ విజయంతో వచ్చే వారం ప్రకటించనున్న ర్యాంకింగ్స్‌లో బర్టీ రెండో స్థానానికి చేరనుంది. దీంతో 1976 ఇవోన్‌ గులాగొంగ్‌ కావ్లే తర్వాత అత్యుత్తమ ర్యాంక్‌ సాధించిన ఆస్ట్రేలియన్‌ మహిళగా చరిత్ర సృష్టించింది. కొంతకాలం ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడి 2016లో టెన్నిస్‌ కోర్ట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన బర్టీ ఫైనల్‌ మ్యాచ్‌ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన మార్కెటా టైటిల్‌ ఫైట్‌లో తేలిపోయింది.

వార్వన్సైడ్
టైటిల్‌ పోరులో బర్టీ 27 విన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించగా, మార్కెటా 10 విన్నర్లు మాత్రమే కొట్టి, 22 అనవసర తప్పిదాలు చేసింది. మ్యాచ్‌ ప్రారంభంలోనే డబుల్‌ఫాల్డ్‌ చేసి రెండు బ్రేక్‌ పాయింట్లు ఇచ్చి బర్టీని 2–0 లీడ్‌కు చేర్చిన 19 ఏళ్ల మార్కెటా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఏ దశలోనూ పైచేయి సాధించలేకపోయింది. ధాటిగా ఆడిన బర్టీ కళ్లు చెదిరే ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో తొలి సెట్‌ను 29 నిమిషాల్లోనే ముగించింది. రెండో సెట్‌లో కాస్త పోరాడిన మార్కెటా తొలిసారి సర్వీస్‌ను కాపాడుకోవడంతో పాటు, మూడో గేమ్‌లో రెండు బ్రేక్‌ పాయింట్లు కాచుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బర్టీ ప్రత్యర్థికి మరో అవకాశమివ్వకుండా చక్కటి స్మాష్‌తో సర్వీస్‌ను బ్రేక్‌ చేసి మ్యాచ్‌ పాయింట్ గెలిచింది.

Latest Updates