అశోక్‌గెహ్లాట్‌కు పదవీ గండం.. బీజేపీతో టచ్‌లో ఉన్న సచిన్‌పైలెట్‌?

  • అధిష్టానానికి పంచాయిత

జైపూర్‌‌: కర్నాటక, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు రాజస్థాన్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక్కోరికి రూ.15కోట్ల వరకు ఆఫర్‌‌ చేస్తున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. కానీ గెహ్లాట్‌ ఆరోపణలు కరెక్ట్‌ కాదని బీజేపీ ఖండించింది. అంతే కాకుండా తామంతా పార్టీతోనే ఉన్నామని దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు స్టేట్‌మెంట్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సీన్‌ రివర్స్‌ అయినట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫీల్‌ అవుతున్న డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని అశోక్‌ గెహ్లాట్‌ వర్గాలు ఆరోపించాయి. లోకల్‌ లీడర్స్‌ తనకు సరైన ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదని, దీనిపై సెంట్రల్‌ లీడర్‌‌షిప్‌ జోక్యం చేసుకోవాలని సచిన్‌ పైలెట్‌ చాలా రోజుల నుంచి అంటున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక కాంగ్రెస్‌ నేత అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు అశోక్‌గెహ్లాట్‌ శనివారం మంత్రులతో సమావేశం నిర్వహించగా.. సచిన్‌ పైలెట్‌ ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. కాగా.. ఈ ఇద్దరి పంచాయితీ ఢిల్లీకి చేరిందని, ఇద్దరు నేతలు తమ ఎమ్మెల్యేలతో కలసి పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో సీనియర్‌‌, కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి చేరడంతో ఆయనతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జంప్‌ అయ్యారు. దీంతో ఎంపీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాజస్థాన్‌లో కూడా ఎమ్మెల్యేలను కొనాలని మోడీ, అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని గెహ్లాట్‌ ఆరోపించారు. అయితే ఆ విమర్శలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కలహాల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడింది. కావాలనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అని బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ సతీశ్‌ పొన్నియా అన్నారు.

Latest Updates