గుర్తింపు ఎలక్షన్లు పెట్టాలె : అశ్వత్థామ రెడ్డి

ప్రజాస్వామ్య దేశంలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని, ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్‌ చేశారు. యూనియన్ల కోసం రహస్య ఓటింగ్ పెట్టాలని, మెజార్టీ కార్మికుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని, ఎన్నికలు పెట్టకుంటే న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కౌన్సిల్‌లో సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో వెల్లడించాలని, సంక్షేమ కౌన్సిల్‌లో చేరుతున్నట్లు సంతకం పెట్టకపోతే కండక్టర్ల నుంచి క్యాష్ తీసుకోవడం లేదని, భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా కండక్టర్లకు విధులు కేటాయించవద్దని సీఎం పేర్కొంటే, వారందరికీ మార్నింగ్ షిప్ట్ వేస్తున్నారని, మధ్యాహ్నం షిఫ్ట్‌కు వచ్చిన మహిళా కండక్టర్లను తీసుకోవడంలేదని చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడూ సంతోషంగా పనిచేయడం లేదని, బెంగళూరులో 7 వేల బస్సులు ఉన్నాయని, హైదరాబాద్‌లో ఉన్న 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులను తగ్గించారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా కేటాయించే డ్యూటీలను ఎత్తివేయాలని, లేదంటే కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమ్మె కాలంలో కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పదవీ విరమణ వయసు 60 ఏండ్లకు వద్దని, కోరుకున్న వాళ్లకు మాత్రమే పెంచాలన్నారు. కార్మికులను ఉద్యోగులుగా చూడాలని సీఎం కేసీఆర్‌ చెప్పి రెండు వారాలైనా పాత పద్ధతిలోనే కార్మికులుగా చూస్తున్నారని ఆరోపించారు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని, అలాంటప్పుడు 1,334 అద్దె బస్సులు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో ఎస్‌.బాబు, రవీందర్‌ రెడ్డి, బీవీ రెడ్డి, మారయ్య, వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates