అశ్విన్ అవసరమా.? జడేజాను బరిలోకి దింపాలా?

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు న్యూజిలాండ్‌‌తో తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమికి లెక్కలేనన్ని కారణాలున్నాయి. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, చతేశ్వర్‌‌ పుజారా, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా వైఫల్యం.. ఫామ్‌‌లో ఉన్న లోకేశ్‌‌ రాహుల్‌‌ను కాదని ఓపెనర్‌‌గా పృథ్వీషాను బరిలోకి దించడం.. కేవలం నలుగురు స్పెషలిస్ట్‌‌ బౌలర్లతోనే ఆడడం ఇండియాను దెబ్బతీసింది..! వీటితో పాటు స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ బ్యాటుతో ప్రభావం చూపలేకపోయాడు. టాపార్డర్‌‌ విఫలమైనప్పుడు లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాటింగ్‌‌ భారం మోయాల్సిన అశ్విన్‌‌ రెండు ఇన్నింగ్స్‌‌ల్లోనూ ఫెయిలయ్యాడు. ఈ ఒక్క మ్యాచ్‌‌లోనే కాదు దాదాపు మూడేళ్ల నుంచి అశ్విన్‌‌ బ్యాట్‌‌తో ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. మిగతా బ్యాట్స్‌‌మెన్‌‌ రాణిస్తున్నప్పుడు.. విజయాలు వస్తున్నప్పుడు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు గానీ.. వెల్లింగ్టన్‌‌ ఓటమి తర్వాత అశ్విన్‌‌ బ్యాటింగ్‌‌ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మధ్య బ్యాట్‌‌తోనూ అదరగొడుతున్న మరో స్పిన్​ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాను తుది జట్టులో ఆడించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

కెరీర్‌‌ ఆరంభంలో అశ్విన్‌‌ను కామెంటేటర్లు వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌తో పోల్చేవాళ్లు. పొడగరులైన ఈ ఇద్దరి ఫుట్‌‌వర్క్‌‌ ఒకేలా ఉండేది. లక్ష్మణ్‌‌ మాదిరిగా క్రీజులో కదలకుండా నిల్చునే అశ్విన్‌‌ బాల్‌‌ను మాత్రం పర్‌‌ఫెక్ట్‌‌గా హిట్‌‌ చేస్తాడు. టఫ్‌‌ పిచ్‌‌లపై టాపార్డర్‌‌ ఫెయిలైన సందర్భాల్లో రవిచంద్రన్‌‌ అలవోకగా బ్యాటింగ్‌‌ చేయడం, మిడిలార్డర్‌‌తో కలిసి విలులైన పరుగులు అందించడం చాలాసార్లు చూశాం. కానీ, అది గతం. చాలా కాలంగా అశ్విన్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించలేకపోతున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌‌లో తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. 2017 వరకూ 34.92 గా ఉన్న ఈ సీనియర్‌‌ స్పిన్నర్‌‌ బ్యాటింగ్‌‌ యావరేజ్‌‌ ఈ మూడేళ్లలో 17.78కి పడిపోవడం శోచనీయం.

తాను అతి జాగ్రత్తగా బ్యాటింగ్‌‌ చేస్తున్నానని, త్వరగా ఔటైపోతానేమోనని భయపడుతున్నానని, తిరిగి తన నేచురల్‌‌ స్టయిల్లో ఆడాలని భావిస్తున్నట్టు తొలి మ్యాచ్‌‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో అశ్విన్‌‌ తెలిపాడు. కానీ, ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో టిమ్‌‌ సౌథీ వేసిన అద్భుత బాల్‌‌కు గోల్డెన్‌‌ డకౌటైన రవిచంద్రన్, సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లోనూ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యాడు. ఫాస్ట్‌‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఈ మధ్య మరోసారి స్టాన్స్‌‌ను మార్చుకున్న అశ్విన్‌‌ తన బ్యాట్‌‌ను ఎక్కువ ఎత్తులో ఉంచి బ్యాక్‌‌ లిఫ్ట్‌‌ షాట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. కవర్స్‌‌ మీదుగా డ్రైవ్స్‌‌ ఆడేందుకు ఈ టెక్నిక్‌‌ ఉపయోగపడుతుంది గానీ.. డౌన్‌‌ ద గ్రౌండ్‌‌, మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా షాట్లు ఆడడం కష్టం అవుతుంది. అలాగే, ఎల్బీడబ్ల్యూ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. అశ్విన్‌‌కు ఈ విషయం తెలియనిదేమీ కాదు. కానీ, పరిస్థితులకు తగ్గట్టు స్టాన్స్‌‌, టెక్నిక్‌‌, షాట్లను మార్చుకోకపోవడం వల్లే సమస్య ఎదురవుతోంది. అందుకే సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో11వ బంతికే సౌథీ బౌలింగ్‌‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

అశ్విన్‌‌ తడ‘బ్యాటు’.. జడేజా జోరు

2017 ఆరంభం నుంచి 36 ఇన్నింగ్స్‌‌లు ఆడిన రవిచంద్రన్‌‌ 30 బాల్స్ ఆడకముందే 20 సార్లు ఔటయ్యాడంటే ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. 30 నుంచి 50 బాల్స్‌‌ మధ్యలో ఆరు సార్లు వికెట్‌‌ ఇచ్చుకున్న అశ్విన్‌‌.. 50 కంటే ఎక్కువ బంతులను కేవలం ఏడు ఇన్నింగ్స్‌‌ల్లోనే ఎదుర్కొన్నాడు. 2017 ఆగస్టులో శ్రీలంకపై హాఫ్‌‌ సెంచరీ చేసిన తర్వాత మళ్లీ ఫిఫ్టీ మార్కు దాటలేకపోయాడు. అయితే, లాంగ్‌‌ ఫార్మాట్‌‌లో పరుగులు చేయలేక అశ్విన్‌‌ తడబడుతున్న సమయంలో విదేశీ గడ్డపై టెస్టుల్లో అతనికి పోటీగా ఉన్న మరో స్టార్‌‌ స్పిన్నర్‌‌ జడేజా మాత్రం బ్యాట్‌‌తో అదరగొడుతున్నాడు.

ఈ మధ్య కాలంలో తన బ్యాటింగ్‌‌ను మరో లెవల్‌‌కు తీసుకెళ్లిన జడ్డూ 2017 తర్వాత ఆడిన 21 టెస్టుల్లో 49.80 యావరేజ్‌‌తో నిలవడం విశేషం. ఈ టైమ్‌‌లో 31 ఇన్నింగ్స్‌‌ల్లో బ్యాటింగ్‌‌ చేసిన జడ్డూ 11 సార్లు నాటౌట్‌‌గా నిలిచాడు. ఓ సెంచరీ, ఐదు హాఫ్‌‌ సెంచరీలు కూడా సాధించిన రవీంద్ర.. ఆరు ఇన్నింగ్స్‌‌ల్లో వంద కంటే ఎక్కువ బాల్స్‌‌ను ఎదుర్కొని జట్టుకు అండగా నిలిచాడు. 2017 స్టార్టింగ్‌‌ నుంచి రవిచంద్రన్‌‌ సగటున 33 బంతులు ఎదుర్కొని వికెట్‌‌ ఇచ్చేస్తుంటే.. జడేజా మాత్రం 79 బాల్స్‌‌ ఆడిగానీ ఔట్‌‌ కావడం లేదు.  టెస్ట్‌‌ క్రికెట్‌‌లో జడ్డూ టాప్‌‌ ఆల్‌‌రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. మరోవైపు అశ్విన్‌‌ ఈ ఫార్మాట్‌‌ బెస్ట్‌‌ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నప్పటికీ.. బ్యాట్‌‌తో తరచూ విఫలమవుతూ నమ్మదగిన ఆల్‌‌రౌండర్‌‌  పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు.

స్పిన్నర్‌‌గా ఓకే కానీ..

బౌలింగ్​ విషయానికొస్తే 2019-–20 హోమ్‌‌ సీజన్‌‌లో అశ్విన్‌‌ అద్భుతంగా రాణించాడు. గతంలో మాదిరిగా మన పిచ్‌‌లు పూర్తిగా స్పిన్‌‌కు అనుకూలించనప్పటికీ వైవిధ్యమైన బౌలింగ్‌‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌పై పైచేయి సాధించాడు. అదే సమయంలో లిమిటెడ్‌‌ ఓవర్లలో అదరగొట్టిన జడేజా.. టెస్టుల్లో వికెట్‌‌ టేకింగ్‌‌ బౌలర్‌‌గా నిలవలేకపోయాడు. అందుకే బేసిన్‌‌ రిజర్వ్‌‌లో జడేజాను కాదని మేనేజ్‌‌మెంట్‌‌ అశ్విన్‌‌కు చాన్సిచ్చింది. బౌలర్‌‌గా అశ్విన్‌‌ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగానే నిర్వర్తించాడు. ఇషాంత్‌‌ తర్వాత సెకండ్‌‌ బెస్ట్‌‌ బౌలర్‌‌గా నిలిచాడు. డ్రిఫ్ట్‌‌, షార్ట్‌‌ టర్న్‌‌, బౌన్స్‌‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌కు సవాల్​ విసిరాడు.  ముఖ్యంగా టాప్‌‌ క్లాస్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే, ఫామ్‌‌ దృష్ట్యా జడేజాకు అవకాశం ఇస్తే బౌలింగ్‌‌లో అతను అశ్విన్‌‌ పెర్ఫామెన్స్‌‌ను మ్యాచ్‌‌ చేయడంతో పాటు బ్యాటింగ్‌‌లో ఎనిమిదో నంబర్‌‌కు మరింత స్థిరత్వం తీసుకొచ్చేవాడని విశ్లేషకులు అంటున్నారు. రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక  ముందు మేనేజ్‌‌మెంట్‌‌ ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెల్లింగ్టన్‌‌లో ఏ ఒక్క ఇన్నింగ్స్‌‌లో అయినా ఏడో వికెట్‌‌కు మంచి పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నమోదైతే ఇండియా పుంజుకునే అవకాశం ఉండేది.

2018 అడిలైడ్‌‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో ఇండియా 127/6తో కష్టాలో పడినప్పుడు పుజారాతో జతకలిసిన అశ్విన్‌‌ ఏడో వికెట్‌‌కు 62 రన్స్‌‌ జోడించాడు. ఆ తర్వాత మన జట్టు 250 రన్స్‌‌ చేసి మ్యాచ్‌‌లో గెలిచింది. కానీ, వెల్లింగ్టన్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 132/6తో ఉన్నప్పుడు రహానెతో కలిసిన అశ్విన్‌‌ అదే స్కోరు వద్ద ఔటవగా.. సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో 148/6తో ఉన్నప్పుడు పంత్‌‌కు జతకలిసి 14 పరుగులే జోడించాడు. బ్యాట్స్‌‌మన్‌‌గా సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండడంతో పాటు తన ఆటపై కాన్ఫిడెన్స్‌‌తో ఉన్న జడేజా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావం చూపగలడని అనిపిస్తోంది. పేసర్లెవరికీ పెద్దగా బ్యాటింగ్‌‌ చేసే సామర్థ్యం లేకపోవడంతో  ఏడో నంబర్‌‌ తర్వాత బ్యాట్‌‌తో మెప్పించే ఆటగాడు ఉంటే జట్టు బలం మరింత పెరగనుంది. మరి, బ్యాట్‌‌తో తడబడుతున్న అశ్విన్‌‌ను రెండో టెస్టుకు కొనసాగించడం అవసరమా?  జడేజాను బరిలోకి దింపాలా?  కెప్టెన్‌‌ విరాట్​ కోహ్లీ, కోచ్‌‌ రవిశాస్త్రి తేల్చుకోవాలి.

Latest Updates