ASI రిపోర్టు: అయోధ్య తీర్పులో కీలక పాత్ర

అయోధ్య రామ మందిరం – బాబ్రీ మసీదు వివాదంపై శనివారం ఉదయం  సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ జడ్జిమెంట్ వచ్చింది. మసీదు కట్టుకోవడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు మరో చోట ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది ధర్మాసనం. ఈ తీర్పు ఇచ్చేటప్పడు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మత విశ్వాసాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చెప్పింది.

తీర్పు కాపీలో 92 పేజీలు ASI రిపోర్టు గురించే

మరి సుప్రీం తీర్పులో కీలకమైన ఆధారమేంటి? ఏ శాస్త్రీయ ఆధారాలను పరిగణనలోకి తీసుకుంది? ఇవి అందరికీ వచ్చే అనుమానాలే… దానికి సమాధానం పురాతత్వ శాస్త్రవేత్తల నివేదిక. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సమర్పించిన రిపోర్టు.. సుప్రీం కోర్టు ఈ తీర్పు  వెల్లడించడంలో కీలకంగా మారింది. మొత్తం 1045 పేజీల తీర్పు కాపీలో ASI నివేదిక, దాని గురించి ఐదుగురు న్యాయమూర్తుల అభిప్రాయాలు 92 పేజీల్లో (N.9 చాప్టర్‌లో 507వ పేజీ నుంచి 599వ పేజీ వరకు) వెల్లడించారు.

వివాదాస్పద స్థలంపై ASI శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా పరిశోధించారు. మసీదు కింది భాగంలో ఓ మందిరం ఉండేదని తన రిపోర్టులో తెలిపింది. తూర్పు వైపు ద్వారంతో ఆలయం ఉందని, అక్కడ విగ్రహారాధన జరిందని పేర్కొంది. దేవతామూర్తులకు అభిషేకించిన నీళ్లు బయటకు వెళ్లడానికి అన్ని దేవాలయాల్లో కనిపించే రాతి నిర్మాణం శిథిలాల్లో లభించిందని ASI తెలిపింది. 1528వ సంవత్సరానికి పూర్వం చాలా ఏళ్ల నుంచే ఇవన్నీ ఉన్నట్లు రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగానే మసీదు కింద ముస్లిమేతర మందిరం ఉండిందని సుప్రీం కోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. అక్కడ ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు కట్టలేదని, మందిరంపైనే నిర్మాణం జరిగిందని సుప్రీం పేర్కొంది.

దివ్యమైన రామ మందిరం ఉండేది: ASI మాజీ రీజినల్ డైరెక్టర్ కేకే ముహమ్మద్

ASI అందించిన పురాతత్వ, చారిత్రక, శాస్త్రీయ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిందని ASI నార్త్ రీజినర్ మాజీ డైరెక్టర్ కేకే ముహమ్మద్ అన్నారు. బాబ్రీ మసీదు నిర్మాణానికి పూర్వం అక్కడ ఒక దివ్యమైన రామ మందిరం ఉండేదని ఆయన చెప్పారు. అక్కడ ఇప్పుడు మళ్లీ ఆలయ నిర్మాణం జరగాలని అన్నారు. ఈ విషయాన్ని గతంలో చెప్పినందుకు కొందరు తనను వేధించారని చెప్పారాయన. ఎట్టకేలకు అందరూ కోరుకుంటున్న నిర్ణయం వెలువడిందని అన్నారు ముహమ్మద్.

Latest Updates