రెండు కాళ్లు పోయినా… ఆత్మవిశ్వాసంతో విధిరాతను జయించాడు

సంకల్పం గట్టిదైతే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉంటే విధిరాతను కూడా జయించవచ్చు. అని నిరూపించాడు ఓ యువకుడు. మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోయాయి. ప్లాస్టిక్‌ కాళ్లు పెట్టినా.. నడవడమే కష్టం అన్నారు డాక్టర్లు. అయినా అధైర్య పడలేదు. పెట్టుడు కాళ్లతోనే ముందడుగు వేశాడు. అన్నీ తానై వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సాయం చేస్తున్నాడు.

విష్ణుమూర్తిది ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం గురుడుపేట్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అతడు డిగ్రీ చదువుతూనే తల్లిదండ్రులకు అన్ని పనుల్లో సాయం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒకసారి వాళ్లు పొలంలో వరి కోస్తున్నప్పుడు, విష్ణు క్రషర్‌‌ నుంచి ధాన్యం తీస్తానని చెప్పి మిషన్ మీదకు ఎక్కాడు. కళ్లు మూసి తెరిచే లోపే ప్రమాదం జరిగిపోయింది. అతడు క్రషర్‌‌లో పడటంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. డాక్టర్లు కాళ్లు సగానికి తొలగించారు.

ప్లాస్టిక్ కాళ్లతో పొలానికి

రెండు కాళ్లు పోయినా విష్ణు ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. స్థానిక ఎమ్మెల్యే చేసిన సాయంతో జర్మన్ టెక్నాలజీతో చేసిన రెండు ఆర్టిఫిషియల్ కాళ్లను అమర్చారు డాక్టర్లు. ఆరు నెలలు కాస్త కష్టపడ్డాడు. తర్వాత కృత్రిమ కాళ్లతో నడవడం అలవాటు చేసుకున్నాడు. నడవడమే కాదు, అన్ని పనులూ చేస్తున్నాడు. ఆదర్శ యువరైతుగా మారాడు. కృత్రిమ కాళ్లతోనే బైక్ నడుపుతాడు. పంటకు నీళ్లు పెట్టడం, కలుపు తొలగించడం, మందులను పిచికారీ చేయడం, ఆవుల ఆలనా పాలనా చూడడం.. ఒక్కటేమిటి అన్ని పనులూ చేస్తున్నాడు. ఏ క్రషర్ అయితే తనకు వైకల్యం తెచ్చిందో.. అదే మిషన్‌ నడుపుతున్నాడు. వైకల్యం ఉన్నా తాను కుటుంబానికి భారం కావద్దనుకున్నాడు. పేద తల్లిదండ్రులకు అండగా ఉండాలనే పట్టుదలతో వ్యవసాయ పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

చేయూత ఇస్తే బాగుండు

బాధ పడుతూ కూర్చుంటే జీవితం సాగదు కదా అందుకే ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. కుటుంబంలో అందరూ సహకరిస్తున్నారు. సర్కార్ చేయూత ఇస్తే బాగుండు. ఉద్యోగం ఇస్తే చేసుకుని స్థిరపడతా. కృత్రిమ కాళ్లు నాకు రెండో జన్మ ఇచ్చాయి. దీనికి ఎమ్మెల్యేతో పాటు ఇంట్లో వాళ్లు చాలా సహకరించారు. – విష్ణుమూర్తి

Latest Updates