నిరుద్యోగులకు దారి చూపించమని అడిగితే.. దాడి చేశారు

నిరుద్యోగులకు దారి చూపించమని అడిగితే.. దాడి చేశారు
  • నిరుద్యోగుల కోసం వారానికోకసారి వ్రతమే చేస్తున్నా..
  • నల్గొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంల నిరుద్యోగ దీక్షలో వైఎస్ షర్మిల
  • నాడు శ్రీకాంతాచారి ఉద్యమం కోసం..నేడు శ్రీకాంత్ ఉద్యోగం కోసం ప్రాణాలొదిలారు: షర్మిల

మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు దారి చూపించమని అడిగితే.. తనపై వ్యక్తిగతంగా దాడికి దిగారని.. వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లవుతున్నా పరిస్థితి ఏ మాత్రం మారకపోగా మరింత దిగజారిందని ఆమె ఆందోలన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంల గ్రామంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ పాలకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ బాగుపడాలని నాడు శ్రీకాంతాచారి ఉద్యమం కోసం ప్రాణాలర్పిస్తే.. నేడు శ్రీకాంత్ ఉద్యోగం కోసం ప్రాణాలొదిలడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. 
తెలంగాణలో నిరుద్యోగం అత్యధికంగా ఉంది.. ఏడేళ్లలో నాలుగు రెట్లు నిరుద్యోగం పెరిగింది..  వీళ్లు పాలకులు కారు, అసలు మనుషులే కారని ఆమె అన్నారు. ఫీజులు కట్టలేక యువత తాము కుటుంబానికి భారంగా మారమని భావించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆమె పేర్కొన్నారు. పుట్టడం గొప్పకాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడం గొప్ప అని ఆమె అన్నారు. ఖాళీగా ఉన్న లక్షా తొంభై ఒక్కవేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. కాదు అని బాధ్యత విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని షర్మిల హెచ్చరించారు. 
టీఆరెస్ పాలనలో సంక్షోభం ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది వైఎస్సార్, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించింది వైఎస్సార్, 46 లక్షల పక్కా ఇళ్లు వైఎస్సార్ కట్టించారు, 58వేల జంబో డీఎస్సీ ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని ఆమె వివరించారు. ఇప్పుడు ప్రతి కుటుంబం అప్పుల పాలై పోయింది, తెలంగాణ రాష్ట్రం నాలుగు లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బాత్ రూమ్ లలో బులెట్ ప్రూఫ్ లు సమంజసమేనా..?
ఒకపక్క ప్రజలు ఇన్ని కష్టాలు.. ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ అనవసర ఖర్చులతో పేదలపై మరింత భారం మోపుతున్నారని షర్మిల ఆరోపించారు. బాత్ రూమ్ లకు కూడా బుల్లెట్ ప్రూఫ్ లు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. తాను మొదటిసారి బయటకొచ్చి ఉద్యమిస్తే.. వ్రతాలు అంటూ అవహేళన చేశారని గుర్తు చేస్తూ.. అవును.. నిరుద్యోగుల కోసం వారానికోకసారి వ్రతమే చేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. మీకు ధైర్యం, దమ్ముంటే నిరుద్యోగం మీద మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం మా సొత్తు, మా చివరి రక్తపు బొట్టు కూడా ప్రజల కోసమేనని ఆమె స్పష్టం చేశారు.
దళితులకు కనీసం 50 లక్షలు ఇవ్వాలి
పబ్బం గడుపుకునేందుకు దుబ్బాక, జిఎచ్ఎంసీ, హుజుర్ నగర్,నాగార్జున సాగర్, ఇప్పుడు హుజురాబాద్ అవే మాటలు, అవే హామీలు గుప్పిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలోని దళితులకు కనీసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగాల నోటిపికేషన్ విడుదల చేయాలన్నారు. అలాగే నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు లక్షల ప్రయివేటు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని షర్మిల కోరారు.