ట్రైన్‌లో పురిటి నొప్పులు.. ముగ్గురు పిల్లలు పుట్టి కొద్దిసేపటికే..

పొత్తిళ్లలోనే కన్నుమూసిన ఇద్దరు పసికందులు

అమ్మ సంతోషాన్ని నిలబెట్టిన ఒకే ఒక్క గట్టిపిండం!

భద్రక్: రైలులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి మహిళా ప్రయాణికులు.. ఆమెకు పురుడుపోశాడు. దేవుడు ఆమెకు ఒకే కాన్పులో ఏకంగా ముగ్గురు పిల్లల్నిచ్చాడు. కానీ ఆ సంతోషాన్ని కొన్ని గంటలు కూడా నిలవనివ్వలేదు. ఆ పసికందుల్లో ఇద్దరు పొత్తిళ్లలోనే కన్నుమూశారు. ఒకే ఒక్క శిశువు మాత్రమే మృత్యువును గెలిచింది. అవును చావును గెలిచి.. అమ్మ కళ్లలో అనందాన్ని కొంతైనా నిలిపింది. ఎందుకంటే నెలలు నిండకుండానే 7 నెలలకే ఆ తల్లికి ప్రసవమైంది.

బెంగళూరు నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు (12509)లో జరిగిందీ ఘటన. ఈ ట్రైన్‌లో ఉన్న ఏడు నెలల గర్భిణి అయిన అసామీ మహిళ మంజులా ఖతూన్‌ (29)కు శుక్రవారం ఉదయం ఒడిశాలోని జాజ్‌పూర్ స్టేషన్ సమీపంలో పురిటి నొప్పులు వచ్చాయి. రైలులోని తోటి మహిళలు ఆమెకు ప్రసవం అయ్యేలా ఉండడంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాతి స్టేషన్‌లో రైలు ఆపేలోపే ఆమెకు బోగీలోనే పురుడు పోశారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది మంజుల. రైలు జాజ్‌పూర్ స్టేషన్ వద్దకు చేరుకునేలోపే వైద్య సిబ్బంది అక్కడికి వచ్చేశారు.

తల్లీబిడ్డలను భద్రక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తుండగా.. ఇద్దరు పసికందులు కన్నుమూశారు. ఒకే ఒక్క శిశువు ప్రాణాలతో నిలిచి.. ఆ అమ్మ సంతోషాన్ని తుడిచిపెట్టుకుని పోకుండా కాపాడింది. తల్లితో పాటు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని మంజుల కుటుంబసభ్యులకు తెలియజేసి.. భద్రక్ రావాలని చెప్పామని రైల్వే అధికారులు తెలిపారు.

Latest Updates