అసెంబ్లీలన్నీ పేక మేడలే!

సగటున ప్రతి మూడు నెలలకొకసారి దేశంలో ఏదో ఒకచోట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి.  ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్​ కాబట్టి, మెజారిటీకి అవకాశం లేనిచోట్ల కొత్తగా ఎన్నికలు ఎదురవుతాయి.  గతంలో కేంద్రం కన్నెర్ర చేసినా ఎన్నికలు జరిగిన సందర్బాలున్నాయి. ముఖ్యంగా నాన్​–కాంగ్రెస్​ ప్రభుత్వాలపై  ఆర్టికల్​–356ని నెహ్రూ మొదలుకొని రాజీవ్​ గాంధీ వరకు ఇష్టానుసారంగా ప్రయోగించేవారని చరిత్రకారులు చెబుతారు. మరికొన్నిసార్లు మైనారిటీలో పడ్డ నాన్​–కాంగ్రెస్​ ప్రభుత్వాలకు మద్దతు పలికి బల పరీక్ష సమయంలో చేతులెత్తేసిన సందర్భాలుకూడా ఉన్నాయి. మొత్తం మీద అసెంబ్లీల కాలపరిమితిని రాజ్యాంగం నిర్ణయించగలదే తప్ప… నిర్బంధంగా ఫిక్స్​ చేయలేదని ఎక్స్​పర్ట్​లు అంటున్నారు.  ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న అయిదారు రాష్ట్రాల్లో మినహాయిస్తే ఇతర అసెంబ్లీలన్నీ గాలిలో మేడల్లాంటివేనని చెబుతున్నారు.

మన దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు. రాజ్యాంగం ప్రకారం వీటిలో 30 చోట్ల ప్రతి అయిదేళ్లకొకసారి, జమ్మూ కాశ్మీర్​లో ప్రతి ఆరేళ్లకొకసారి ఎన్నికలు జరపాలన్నది నియమం. దీనిని సక్రమంగా నిర్వహించిన సందర్భాలు చాలా రాష్ట్రాల్లో లేవు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్​–356ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుని అనేకసార్లు అసెంబ్లీలను రద్దు చేయించిన చరిత్ర ఉంది. ప్రపంచంలోనే గొప్ప డెమొక్రాట్​గా గుర్తింపు పొందిన పండిట్​ జవహర్​లాల్​ నెహ్రూయే మొట్టమొదట ఆర్టికల్​–356ని దుర్వినియోగం చేశారని చరిత్రకారులు చెబుతారు. కేరళలో ప్రజాస్వామికంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుతాన్ని రద్దుచేయించారు నెహ్రూ. ప్రపంచంలోనే ఫస్ట్​ టైమ్​ కమ్యూనిస్టులు బ్యాలెట్​ ద్వారా అధికారంలోకి వచ్చిన సందర్భం అది. అయినప్పటికీ నెహ్రూ కత్తిగట్టి ఆర్టికల్​–356ని ప్రయోగించి, నాన్​–కాంగ్రెస్​ ప్రభుత్వం (ఈఎంఎస్​ నంబూద్రిపాద్​ కేబినెట్​)ని కూలదోయించారు.

ఆ తర్వాతకూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్​ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకోవడమో, లేక మళ్లీ ఎన్నికలకు వెళ్లి తమ ప్రభుత్వాలు ఏర్పడేలా ప్రచారం చేసుకోవడమో జరిగింది.  కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉన్నరోజుల్లో సైతం అసమ్మతిని అదుపు చేయడంకోసం రాష్ట్రపతి పాలన విధించిన పరిస్థితులున్నాయి. ఉదాహరణకు ఒడిశాలో నందిని శతపథి విషయంలో అదే జరిగింది. 1972లో ఆమె అధికారానికొచ్చిన తర్వాత ఏడాది తిరక్కుండానే రాష్ట్రపతి పాలన విధించారు. 1973 మార్చి నుంచి 1974 మార్చి వరకు ప్రెసిడెంట్​ రూల్​ నడిచాక, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరలా శతపథినే ముఖ్యమంత్రిగా వచ్చారు. 1976లో మరోసారి రాష్ట్రపతి పాలనను (13 రోజులు) సాగించి, ఆమె స్థానంలో వినాయక్​ ఆచార్యను సీఎంగా ఎంపికచేశారు 1973లో ఆంధ్రప్రదేశ్​లో ‘జై ఆంధ్ర’ ఉద్యమ ప్రభావంతో అప్పటి పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని దింపేసి, రాష్ట్రపతి పాలన విధించి, కొంత సద్దుమణిగాక జలగం వెంగళరావును సీఎంగా ఎంపిక చేశారు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ. ఇవన్నీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండగానే జరిగాయి.

ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్​ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి రాగానే కొత్త థియరీని ప్రవేశపెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్​ పాలిత ప్రభుత్వాలను రద్దు చేయించింది. ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు మినహా చాలా చోట్ల జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.  బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో జయప్రకాశ్​ నారాయణ్​ ‘సంపూర్ణ విప్లవం’తో ప్రభావితమైన నాయకులు అధికారానికొచ్చారు.

రెండున్నరేళ్లు తిరిగేసరికి జనతాపార్టీ ప్రయోగం ఫెయిలైంది. 1980లో మళ్లీ లోక్​సభ ఎన్నికలు జరిగాయి. ఇందిరా గాంధీ చీలిక వర్గం కాంగ్రెస్​ (ఐ) అధికారానికొచ్చింది.  జనతా పార్టీ తెచ్చిన కొత్త థియరీనే కాంగ్రెస్​ ప్రయోగించి…. నాన్​–కాంగ్రెస్​ ప్రభుత్వాలను కూలదోయించి, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపించింది.  ఈ విధంగా రాజకీయ స్థిరత్వమనేది పూర్తిస్థాయిలో ఏర్పడకపోవడంతో తరచుగా ఎన్నికలు జరగడం, ముఖ్యమంత్రులు మారిపోవడంవంటివి జరిగాయి.  తమ తమ అసెంబ్లీల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ… కేంద్రం ఇష్టానుసారంగా ఆర్టికల్​–356ని ప్రయోగించే పరిస్థితి ఉండేది. దీనికోసం గవర్నర్ల వ్యవస్థనుకూడా దుర్వినియోగం చేశారని అప్పటి విషయాలపై అవగాహనగల విశ్లేషకులు చెబుతారు.  ఈ పరిస్థితి 1994లో ఎస్​.ఆర్​.బొమ్మయ్​ కేసులో సుప్రీం కోర్టు చరిత్రాత్మకమైన తీర్పును ఇచ్చేవరకు కొనసాగింది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాల బలాబలాలు అసెంబ్లీలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఫ్లోర్​ టెస్ట్​లో విఫలమై, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేని సందర్భాల్లో మాత్రమే ప్రెసిడెంట్​ రూల్​ విధించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

ఈ పాతికేళ్లలోనూ అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడంతో దేశంలో సంకీర్ణ శకం మొదలైంది. దీంతో అసెంబ్లీలో బలాబలాలు మారిపోవడం, కొత్త ఫ్రంట్​లు ఏర్పడడం, వాటి మధ్య తగాదాలు తలెత్తి ప్రభుత్వాలు కూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. 2015 ఎన్నికల్లో బీహార్​లో జేడీ–యూ, ఆర్జేడీ కూటమి అధికారంలోకి వచ్చాక, రెండేళ్లకే ఫ్రంట్​లో లాలూ ఫ్యామిలీ వర్సెస్​ నితీశ్​ కుమార్​ ఘర్షణ మొదలైంది. బీజేపీ చక్రం తిప్పడంతో నితీశ్​ మళ్లీ ఎన్డీయేలో చేరిపోయి సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. తమిళనాడులోనూ జయలలిత మరణం తర్వాత ఇటువంటి పరిస్థితులే తలెత్తినప్పుడు స్వల్పకాలం ప్రెసిడెంట్​ రూల్​ కొనసాగింది. బీహార్​, తమిళనాడుల్లోనైనా అసెంబ్లీ రద్దు వరకు వెళ్లకుండా స్పీకర్​ బల పరీక్షతో ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక తరచు ‘ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు’ అనే ప్రతిపాదనపై చర్చ లేవనెత్తుతున్నారు. పైన చెప్పుకున్న పరిణామాలు, సందర్భాలను గమనిస్తే… ఆయన ప్రతిపాదన ముందుకెళ్లే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే… ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రకారం అయిదేళ్లకొకసారి మాత్రమే ఎన్నికలు జరపాలంటే సాధ్యం కాదన్నది వాళ్ల వాదన. అలాగని, పూర్తిగా కొట్టిపారేయలేని ప్రపోజల్​గానూ చెప్పడం లేదు.

అయితే, ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలనే అంశంపై స్పష్టత లేదు. ఉదాహరణకు, పొరుగు రాష్ట్రం కర్ణాటకని తీసుకుంటే అక్కడ అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీకి మేజిక్​ ఫిగర్​ రాలేదు. పోయినేడాది జేడీ–ఎస్​కి కాంగ్రెస్​ మద్దతు ప్రకటించి బీజేపీ అధికారంలోకి రాకుండా చేయగలిగింది. అప్పటి నుంచీ కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగానే నడుస్తోంది.  ఒకవేళ పరిస్థితి చేయిదాటిపోతే… అక్కడి గవర్నర్​ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. అధికారానికొచ్చిన తర్వాత బీజేపీ తాజా ఎన్నికలకు వెళ్తే మిడ్​టెర్మ్​ పోలింగ్​ తప్పదు. గతంలో ఆంధ్రప్రదేశ్​ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. 1984లో నాదెండ్ల ఎపిసోడ్​ ముగిసిపోయి, ఎన్టీఆర్​ మళ్లీ అధికారంలోకి వచ్చాక, సభలో ఫుల్​ మెజారిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేయించి, తాజా ఎన్నికలకు వెళ్లింది తెలుగు దేశం పార్టీ​.  1985లో ఓటర్ల తాజా తీర్పుతో మరోసారి పవర్​ దక్కించుకున్నారు ఎన్టీఆర్​. కాబట్టి, అసెంబ్లీల కాలపరిమితిని రాజ్యాంగం నిర్ణయించగలదే తప్ప, కచ్చితంగా ఇంతకాలం కొనసాగి తీరాల్సిందేనని కట్టడి చేయలేదంటున్నారు ఎక్స్​పర్ట్​లు.

భారతీయ జనతా పార్టీ 1996 నుంచి ఇప్పటివరకు దఫదఫాలుగా నాలుగుసార్లు కేంద్రంలో పీఠమెక్కింది. అయినప్పటికీ ఆ పార్టీ చరిత్రలో తమకు అనుకూలంగా లేని నాన్​–బీజేపి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయించిన ఉదంతాలు లేవు. బీహార్, గోవా వంటి చోట్ల పొలిటికల్​ ఈక్వేషన్లను మార్చివేసి తమ ప్రభుత్వాలు ఏర్పడేలా చూసుకుంది. కేవలం వీటినే ఆధారం చేసుకుని అసెంబ్లీలకు ఫిక్స్​డ్​ టెన్యూర్​ని ఇవ్వడం…. సంకీర్ణ శకంలో ఎంతవరకు సాధ్యమవుతుందన్న సందేహం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

మెడమీద కత్తిలా ప్రెసిడెంట్ రూల్
రిపబ్లిక్​గా ఏర్పడిన తర్వాత ఈ 67 ఏళ్లలో ఛత్తీస్​గఢ్​, తెలంగాణ మినహా దాదాపుగా అన్ని రాష్ట్రాలూ రాష్ట్రపతి పాలనలో ఎంతో కొంతకాలం గడిపాయి.  దాదాపు 130 సార్లు ప్రెసిడెంట్​ రూల్​ విధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అత్యధికంగా మణిపూర్​లో10 సార్లు విధించారు. ఆ తర్వాత ఎక్కువగా ప్రెసిడెంట్​ రూల్​లోకి వెళ్లిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్​ (9 సార్లు), జమ్మూకాశ్మీర్​ (8), బీహార్​ (8) ఉన్నాయి. ఫుల్​ మెజారిటీ ఉన్న సందర్భాల్లోసైతం ప్రెసిడెంట్​ రూల్​ విధించడమనేది ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ప్రెసిడెంట్​ రూల్​ తర్వాత తాజాగా ఎన్నికలు జరిపించి తమ పార్టీ ప్రభుత్వమే వచ్చేలా చూసుకున్నాయి.  ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీ, జనతా పార్టీ పోటాపోటీగా ప్రజా ప్రభుత్వాలను రద్దు చేసి కొత్త ఒరవడిని సృష్టించాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే నిలకడ
ఆంధ్రప్రదేశ్​ ఒక్కటిగా ఉన్నరోజుల నుంచి ఇప్పటివరకు 11సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్​ లేదా బలమైన ప్రాంతీయ పార్టీల మధ్యనే అధికారం మారుతూ వచ్చింది. మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన సందర్భం ఒకే ఒక్కటి. ఎన్టీఆర్​ 1985లో రాజకీయ ప్రక్షాళన పేరుతో మిడ్​టెర్మ్​ పోల్​ జరిపించారు. ప్రెసిడెంట్​ రూల్​ మూడుసార్లు ఏర్పడినా అర్ధంతరంగా ప్రభుత్వాల్ని రద్దుచేసి, ఎన్నికల వరకు వెళ్లకపోవడం విశేషం. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. ఒడిశాలో ఆరుసార్లు రాష్ట్రపతి పాలన ఏర్పడింది, 16సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి.  ఆరేళ్ల కాలపరిమితి గల జమ్మూ కాశ్మీర్​లో 8సార్లు ప్రెసిడెంట్​ రూల్​ వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మొత్తంగా 11సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిపించారు.

Latest Updates