అసెంబ్లీ సమావేశాలు తగ్గుతున్నయ్

  • 2014 –18 వరకు 124 రోజులు మాత్రమే..
  • ఏపీతో పోలిస్తే మన దగ్గర తక్కువే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తగ్గుతున్నాయి. సగటున ఏటా కనీసం 50 రోజులు కూడా జరగటం లేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ విడిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ అసెంబ్లీతో  పోలిస్తే ఏపీ అసెంబ్లీ ఎక్కువ రోజులు సమావేశమైంది. 2014 నుంచి 2018 సెప్టెంబర్  ( సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దయింది) వరకు తెలంగాణ అసెంబ్లీ 124 రోజులు మాత్రమే సమావేశమైంది. నాలుగేండ్లకు లెక్కగడితే సగటున ఏడాదికి 31 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2014 నుంచి 2019 మార్చి వరకు 204 రోజులపాటు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా సుమారు 60 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు జరిగేవని మాజీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు 254 రోజులు సమావేశాలు జరిగాయని చెప్తున్నారు.

చర్చకు రాని ప్రజా సమస్యలు!

అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులకు పరిమితమవుతుండటంతో ప్రజా సమస్యలు పెద్దగా చర్చకు రావటం లేదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కొత్తగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ సెషన్స్ తక్కువ ఉండటం, సమయం లేకపోవటం వల్ల అవకాశం దక్కడం లేదని వారు చెప్తున్నారు.

Latest Updates