కరోనా రూల్స్​తో అసెంబ్లీ కొత్తగా..

  • సభలో 6 ఫీట్ల దూరంలో సీటింగ్​.. లాబీలు, గ్యాలరీ, ఎల్పీ ఆఫీసుల్లో శానిటైజర్లు
  • ఉదయం, సాయంత్రం మైకుల శానిటైజేషన్​
  • మీడియా పాయింట్​ బంద్​.. లాబీలోకి జర్నలిస్టులకు నో ఎంట్రీ
  • నేటి నుంచి సమావేశాలు ప్రారంభం.. సుమారు 20 రోజులు నడిచే చాన్స్​
  • ఇవాళ సాయంత్రం కేసీఆర్​ అధ్యక్షతన టీఆర్​ఎస్​ఎల్పీ భేటీ

హైదరాబాద్, వెలుగు:కరోనా ఎఫెక్ట్​తో ఈసారి అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశాలు డిఫరెంట్​గా జరుగనున్నాయి. అసెంబ్లీ లోపల, బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నెగెటివ్​ రిపోర్టు ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే  సభకు హాజరుకాబోతున్నారు. అందరూ టెస్టులు చేయించుకోవాలని, జ్వరం, సర్ది, దగ్గు ఉంటే హాజరుకావొద్దని ఇప్పటికే స్పీకర్​ కోరారు. దీంతో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు టెస్టులు చేయించుకుంటున్నారు. అసెంబ్లీ ఆవరణలో ప్రతి ఒక్కరికీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్​ చెక్ చేయనున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ , లాబీలు, గ్యాలరీ, పార్టీల ఎల్పీ ఆఫీసులు.. ఇలా అన్ని చోట్ల శానిటైజర్లు పెట్టారు. సభ్యులకు ఒకొక్కరికి మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. అదనంగా అసెంబ్లీలో 48 సీట్లు, కౌన్సిల్ లో 8 సీట్లు వేశారు. మీడియా పాయింట్ ను ఎత్తివేశారు. లాబీల్లోకి మీడియాను అనుమతించటం లేదు. కేవలం గ్యాలరీకే అనుమతిస్తారు. సభ్యులు మాట్లాడే మైకులను ఉదయం, సాయంత్రం  శానిటైజ్​ చేస్తారు. ఎమ్మెల్యేల పీఏలను, ఎమ్మెల్సీల పీఏలను అనుమతించరు. మంత్రుల పీఏలను మాత్రమే అనుమతిస్తారు. సభ్యులకు కరోనా కిట్లను ప్రభుత్వం అందించనుంది. వీటిలో శానిటైజర్ , మాస్క్ ఇవ్వనున్నారు. గత మూడు రోజుల నుంచి అసెంబ్లీలో ఉద్యోగులు, పోలీసులు, మార్షల్స్ , మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. సమావేశాలు జరిగేన్ని రోజులు టెస్టులు నిర్వహిస్తారు.

ఫస్ట్​డే సంతాపాలు, బీఏసీ భేటీ

అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మార్చి తర్వాత మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతోపాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి తొలిరోజు అసెంబ్లీ, కౌన్సిల్ సంతాపం ప్రకటిస్తాయి. అనంతరం సమావేశాలు వాయిదా పడగానే.. అసెంబ్లీ, కౌన్సిల్​లో బీఏసీ మీటింగ్​లు స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా ఆధ్వర్యంలో జరుగుతాయి. వీటిలో అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి.. సెలవులు, ప్రవేశపెట్టనున్న బిల్లులు.. చర్చించాల్సిన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 20 రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగవచ్చని టీఆర్ఎస్​ వర్గాలు చెబుతున్నాయి.

నేడు సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ భేటీ

సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్  చీఫ్​, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందింది. అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటి మీద జరగనున్న చర్చల్లో మాట్లాడాల్సిన సభ్యులు, సమాధానాలు ఇచ్చేవారి పేర్లను ఆయన ఖరారు చేయనున్నారు. రెవెన్యూ యాక్ట్ , జీఎస్టీ , సెక్రటేరియట్ నిర్మాణం, శ్రీశైలం ప్రమాద ఘటన, కరోనా నివారణ చర్యలు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి అంశాలపై పార్టీ సభ్యులకు సీఎం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావు కు కరోనా పాజిటివ్ రావటంతో అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బాధ్యతలు మరొకరికి సీఎం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక అంశం టీఆర్​ఎస్​ ఎల్పీ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం.

Latest Updates