అట్లాంటిక్ ‘పాచి’ తిప్పలు

5 వేల కిలోమీటర్ల పొడవునా పాచి

పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో మధ్య ఏముంది? అదేం ప్రశ్న అంటారా. అట్లాంటిక్ మహాసముద్రం. ఈ రెండు తీరాల మధ్య ఉన్న దూరం దాదాపు 5 వేల మైళ్లు. తరచూ నౌకలు అటూఇటూ తిరుగుతుంటాయి. ఎప్పుడూ ఎగసిపడే అలలతో అలజడిగా ఉండే ఈ ప్రాంతమిప్పుడు చప్పబడింది. ఎరుపు, పసుపు కలగలసిన పాచి పైట కప్పుకుంది. అదేదో ఒకటి రెండు కిలోమీటర్లు అనుకుంటే పొరబాటే! ఏకంగా 5 వేల కిలోమీటర్ల పొడవునా పాచి అట్లాంటిక్ సముద్రాన్ని ఆక్రమించేసింది. ఇది ప్రపంచంలోనే అతి పేద్ద పాచి గుట్టని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పాచి మనుషులకు అపాయమని వెల్లడించారు.

ఇది చనిపోయి కుళ్లితే, యాసిడ్ గ్యాసును వదులుతుందని, మురిగిన కోడి గుడ్డు వాసన వస్తుందని చెప్పారు. వాతావరణ మార్పే పాచి పెరుగుదలకు దోహదం చేస్తోందని వివరించారు. దీని వల్ల సముద్ర జీవులు చనిపోయే ప్రమాదం ఉందని, ఫ్లారిడా, టెక్సస్, మెక్సికో, కరేబియన్ బీచులకు రవాణా కష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరేబియన్ దీవులకు వెళ్లే మార్గాన్ని పాచి మూసేసిందని నాసా శాటిలైట్లు తీసిన ఫొటోల్లో సైంటిస్టులు గుర్తించారు.

2010 నుంచి క్రమంగా పాచి పెరుగుతోందని తేల్చారు. ఈ పాచి బరువు రెండు కోట్ల టన్నులు ఉండొచ్చని అంచనా వేశారు. దాదాపు 200 విమానవాహక నౌకలను ఈ పాచితో పూర్తిగా నింపొచ్చని చెప్పారు. అడవుల నరికివేత, పురుగుల మందుల వాడకం పెరగడం వల్లే సముద్రాల్లో పాచి పుట్టుకొచ్చిందని సైంటిస్టులు భావిస్తున్నారు. సముద్ర ప్రవాహాల్లో తరచూ వచ్చే మార్పుల వల్ల అప్పుడప్పుడు కరేబియన్ తో పాటు ఫ్లారిడా, టెక్సస్, మెక్సికో బీచుల్లోకి పాచి కొట్టుకుపోతోంది. ఫలితంగా దాన్ని శుభ్రం చేయడానికి ఆయా ప్రభుత్వాలు ముప్పుతిప్పలు పడుతున్నాయి. పైగా ఇందుకు భారీగా ఖర్చవుతుంది.

Latest Updates