ATMలు ఖాళీ : దేశం మొత్తం నో క్యాష్ బోర్డులు

atm దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది. డబ్బు.. డబ్బు.. డబ్బు అంటోంది. బ్యాంక్ కు వెళితే నో క్యాష్.. ఏటీఎంకి వెళితే ఉత్తి చేతులతో వెనక్కి రావటమే.. చేబదులు అడితే లేదనే సమాధానమే.. బ్యాంకుల్లోని మన డబ్బు లేదు.. అప్పు ఇచ్చేవారి దగ్గర డబ్బు లేదు.. ఏమైపోయింది దేశంలోని డబ్బంతా.. ఎక్కడికి పోయింది.. ఇదే ఇప్పుడు దేశం మొత్తం చర్చ. నిన్నా మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ATMల్లోని నో క్యాష్ బోర్డులు.. ఇప్పుడు దేశం మొత్తం కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 80శాతం ATMల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పని చేసే ఏటీఎంల్లోనూ వందల మంది క్యూ. అలా డబ్బు పెడితే.. ఇలా అయిపోతుంది. బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ ఏరియాలోని ఏటీఎంల్లోనూ డబ్బు లేదు అనే బోర్డులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సీఎంతోపాటు ఇతర ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో రెండు రోజులుగా ATMల్లో నో క్యాష్ బోర్డులు వేలాడుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా స్పందించారు. మార్కెట్ లో 2వేల నోట్లు కనిపించటం లేదని.. ఈ నోట్లు ఎక్కడికి వెళ్లాయి అని అధికారులను ప్రశ్నించారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో 85శాతం ఏటీఎంలు 48 గంటలుగా పని చేయటం లేదు.
దేశంలోని నగదు కొరత నోట్ల రద్దు నాటి పరిస్థితులను గుర్తు చేస్తుంది అంటున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్లినా డబ్బు లేదు అనే మాట వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై RBI స్పందించింది. వరసగా వచ్చిన పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లతో నగదు కొరత ఏర్పడిందని.. మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. అత్యవసరానికి వెయ్యి, రెండు వేల రూపాయలు డ్రా చేద్దాం అన్నా.. 10, 15 ఏటీఎంలు తిరిగితే కానీ పని కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ కస్టమర్లు. ఏటీఎంల్లో డబ్బులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. 10 రోజులుగా ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిస్థితులను చూసిన ప్రజలు.. ముందు జాగ్రత్తగా బ్యాంకుల్లోని డబ్బు మొత్తాన్ని డ్రా చేసి ఇళ్లళ్లలో పెట్టుకోవటం కూడా సమస్యకు ఓ కారణం అంటున్నారు అధికారులు. బ్యాంకుల నుంచి డ్రా చేసే మొత్తం ఎక్కువగా ఉంటుందని.. డిపాజిట్లు రోజురోజుకి తగ్గిపోతున్నాయని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates