కరోనాతో అటామిక్ సైంటిస్ట్ శేఖర్ బసు కన్నుమూత

అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్,అటామిక్ సైంటిస్ట్ పద్మశ్రీ 68 ఏళ్ళ శేఖ‌ర్ బ‌సు ఇవాళ(గురువారం,సెప్టెంబర్-24) క‌న్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కరోనాతో పాటు కిడ్నీ సమస్యలతోనూ ఆయన బాధపడుతున్నారని… ఆరోగ్యం మరింత క్షీణించడంతో గరువారం తెల్లవారుజామున 4.50గంటలకు కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు.

శేఖర్ బసు మృతిపై కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.  మోడీ సర్కార్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు శేఖర్ బసు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా,సెక్రటరీగా ఆయన పనిచేశారని తెలిపారు.

దేశంలో అణుశక్తి అభివృద్ధికి శేఖర్ బసు ఎంతో కృషి చేశారు. అక్టోబ‌ర్ 23,2015-సెప్టెంబ‌ర్ 17,2018 వ‌ర‌కు అటామిక్ ఎన‌ర్జీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌ గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారం అందించింది. 2002లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ అవార్డు, 2006, 2007లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అవార్డులు పొందారు.

దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ రూపకల్పనలో శేఖర్ బసు కీలక పాత్ర పోషించారు. దేశంలో అణువిద్యుత్ ఉత్ప‌త్తి పెంచేందుకు కృషిచేశారు. భారత అణుశక్తి కార్యక్రమంలో దాదాపు 40 ఏళ్ల పాటు శేఖ‌ర్ బ‌సు సేవలు అందించారు.

Latest Updates