
పొట్టకూటి కోసం పోడు భూముల్లో వ్యవసాయం చేస్తే గిరిజనులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అటవీ తల్లిని నమ్ముకున్న గిరిజనులపై ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు. గిరిజనులపై అక్రమ కేసులను ఖండిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు వెంకట్ రెడ్డి. మడమ తిప్పని కేసీఆర్ నీ మాటకు విలువ ఇదేనా అని అన్నారు. గిరిజన సమస్యలపై కేంద్రంతో చర్చలు ఎందుకు జరపలేదో చెప్పాలన్నారు. యావత్ గిరిజనులకు క్షమాపణలు చెప్పి కేసులు వెనక్కి తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే కోమురం భీమ్ స్పూర్తిగా పోరాటం తప్పదని స్పష్టం చేశారు. గత 70 ఏళ్లుగా అటవీ భూముల్లో సాగుచేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న గిరిజన రైతులపై అటవీ అధికారులు దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ మాయ మాటలతో బహుజన, దళిత, మైనార్టీలతో పాటు గిరిజనులను మోసం చేస్తున్నారని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా పోడుభూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చి… ఇప్పుడు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతులకు పట్టాలు ఇస్తామని… గిరిజనుల అటవీ హక్కు చట్టాన్ని కాపాడుతానని ఇప్పటి వరకు మీరు ఏ హామీని నేరవేర్చలేదని లేఖలో విమర్శించారు. గిరిజనులకు అండగా ఉంటానని.. అదే గిరిజనులపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు…మీరు ఇచ్చిన మాటకు విలువ ఇదేనా అంటూ లేఖలో ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్‌తో పాటు అన్ని జిల్లాల్లోని తండాలు, గూడెంలకు చెందిన గిరిజనులపై అక్రమ కేసులను నమోదు చేసి.. పంటలను కూడా ధ్వంసం చేసి రైతులకు కన్నీళ్ళను మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోకపోతే రానున్న రోజుల్లో గిరిజన ముద్దుబిడ్డ స్ఫూర్తిగా ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వెయ్యబోదని తేల్చిచెప్పారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.