వనపర్తి జిల్లాలో దారుణం..కరోనా మృతురాలి అంత్యక్రియలను అడ్డుకున్నారు

వనపర్తి జిల్లా: కరోనాతో మృతి చెందిన ఓ బాలింతరాలు అంత్యక్రియలు గ్రామంలోని శ్మశాన వాటికలో జరపొద్దని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు ఎంత చెప్పినా స్మశానవాటికలో బాలింత అంత్యక్రియలకు స్థానికులు ఒప్పుకోలేదు. దీంతో భార్య అంత్యక్రియలు తన పొలంలో చేసుకుంటానని భర్త డెడ్ బాడీని తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. పెద్దమందడి మండలంలోని జగత్పల్లి గ్రామానికి చెందిన శిరీష వివాహం నాలుగేళ్ల కిందట పామిరెడ్డిపల్లికి చెందిన యాదగిరితో జరిగింది. పది రోజుల కిందట శిరీష… ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. కడుపు నొప్పి రావడంతో సెప్టెంబర్ 24న ఆమెను వనపర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడి డాక్టర్లు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని మహబూబ్ నగర్ తీసుకొని వెళ్లాలని సూచించారు. మహబూబ్ నగర్ లోని మూడు ప్రైవేట్ హాస్పిటల్స్ శిరీషను చేర్చుకోలేదు. దీంతో ఆమెను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ లోని జడ్జిఖానా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తమ దగ్గర వసతులు లేవని వేరే చోటికి తీసుకెళ్లాలని సూచించారు. చేసేదేమీ లేక శిరీషను కొత్తపేటలోని మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమించిందని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి పట్టుకెళ్లాలని సూచించారు. ఉస్మానియా  డాక్టర్లు శిరీషకు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు.

సెప్టెంబర్ 28న చికిత్స పొందుతూ శిరీష చనిపోయింది. మరుసటి రోజు మృతదేహానికి శవపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. తన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో జరుపుకుంటానని బుధవారం ఉస్మానియా హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని పామిరెడ్డిపల్లికి తీసుకొచ్చాడు యాదగిరి. అయితే అంత్యక్రియలను అడ్డుకున్నారు గ్రామస్తులు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. యాదగిరి తన పొలంలోనే భార్యను  ఖననం చేస్తానని డెడ్ బాడీని తీసుకు వెళ్ళడంతో గొడవ సద్దుమణిగింది.

Latest Updates