లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు

ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు దాడిచేసి ఇల్లు కూల్చి వేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉప్పలూరు గ్రామంలో జరిగింది.

ఉప్పలూరు గ్రామానికి చెందిన కలపాల రాజ్‌కుమార్‌, కొండ్రు మౌనిక ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్‌ గన్నవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. మౌనిక భీమవరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. మేజర్లయిన వీరిద్దరూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని  వేలంగిణిమాత ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం సమాచారం తెలుసుకున్న మౌనిక బంధువులు రాజ్‌కుమార్‌ ఇంటిని ధ్వంసం చేశారు. అతని తల్లిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రేమ జంట రక్షణ కల్పించాలని కోరుతూ కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates