చెల్లి ప్రేమ ఫెయిల్ అయ్యిందని ప్రేమికులపై పగ

ప్రేమికులే టార్గెట్ గా దాడులకు పాల్పడుతూ..నగలు,నగదు దోచుకుంటున్న దొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. తన చెల్లి ప్రేమ విఫలం కావడంతో మనస్థాపం చెందిన చందు …నకిలీ పోలీసు అవతారమెత్తాడు. నగర శివార్లలో ఏకాంతంగా తిరిగే ప్రేమజంటలను టార్గెట్ చేశాడు. పోలీసునంటూ వారిని బెదిరించి డబ్బు, నగలు దోచుకోవడం మొదలు పెట్టాడు. ప్రేమ జంటలు కావడంతో తమ విషయం బయట పడుతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో చందు యథేచ్చగా దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు.

అయితే అబ్దుల్లాపూర్ మెట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పాత నేరస్తుడిగా గుర్తించారు. ఎల్.బి. నగర్ సీసీఎస్ పోలీసులు విచారించగా అతను చేసిన నేరాలను అంగీకరించాడు. చందు దగ్గర నుంచి 10 తులాల బంగారం, 3 లక్షల నగదును, ఒక హీరో హోండా యాక్టివా బైకు ను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.

Latest Updates