భైంసా ఘటనలో నిందితుల్ని తప్పించే ప్రయత్నం

భైంసాలో హిందువులపై కొందరు ముస్లిం మూకలు చేసిన మతపరమైన దాడిపై ఎన్‌‌‌‌ఐఏతో విచారణ జరిపించాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌‌‌‌రావు డిమాండ్ చేశారు. ఘటన జరిగి 48 గంటలైనా హోం మంత్రి కానీ, డీజీపీ కానీ ఒక్క ముక్క మాట్లాడలేదని విమర్శించారు. కనీసం పరిస్థితిని అదుపు చేయడానికి కూడా ప్రయత్నించలేదని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. పోలీసుల చేతులు కట్టేసి అసలైన నిందితులను తప్పించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందూ కుటుంబాలకు చెందిన 15 మందికి పైగా బాధితులను పోలీసులు వేధిస్తున్నారని, కొందరిని ఇంకా లాకప్‌‌‌‌లో ఉంచారని అన్నారు.

భైంసాకు చెందిన కొన్ని నేర ముఠాలు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో హిందువులపై భౌతికంగా దాడి చేసి వారి వాహనాలు, ఇళ్ళు తగలబెట్టారన్నారు. మరింత హింస జరుగుతుందేమోనని స్థానికులు భయపడ్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల రాజకీయాల కోసం ఒవైసీ సోదరులు, ఎంఐఎం పార్టీని మంచి చేసుకోవడానికే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని, ఇప్పటివరకు జరిగిన విచారణపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest Updates