థియేటర్లో ఏసీ లేదని ప్రేక్షకుల నిరసన

Audience protests on theater management

సినిమా హాల్ లో ఏసీ ఆన్ చేయలేదని థియేటర్ యాజమాన్యంపై ప్రేక్షకులు షో ముగిసిన తర్వాత అందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలోని ఆనంద్ సినీ కాంప్లెక్సులో జరిగింది.

మహేశ్ బాబు “మహర్షి” మూవీ మార్నింగ్ షో మొదలైన తర్వాత హాల్ లో ఏసీ వేయకపోవడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి లోనయ్యారు. అరచి గోల పెట్టినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో.. సినిమా పూర్తయిన తర్వాత ప్రేక్షకులు బయటకు వెళ్లకుండా అక్కడే భైఠాయించారు. అధిక మొత్తంలో టికెట్ రేటు వసూలు చేసి కూడా.. సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆందోళన చేశారు.

షో పడకముందు నుంచే ఏసీ లేదని చెబుతుంటే.. 5 నిమిషాలు.. 5 నిమిషాలు అంటూ షో అంతా అయ్యేవరకు అలాగే కూర్చోబెట్టారని అన్నారు. రూ.200 పెట్టి మాల్ కు వచ్చామా.. రేకుల షెడ్డుకు వచ్చామా అంటూ నిలదీశారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అందరూ ఉక్కపోతలో ఇబ్బందిపడ్డారని అన్నారు. 

తరువాతి షో కోసం వచ్చిన ప్రేక్షకులు లోనికి రాకుండా వారు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యాజమాన్యం ప్రేక్షకులతో సంప్రదింపులు జరిపింది. స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వండి దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు నిరసన తెలుపుతున్నవారికి చెప్పారు. ఐతే.. తమకు అప్పటికప్పుడు న్యాయం జరగాలని పట్టుబట్టారు. ఎండాకాలంలో ఏసీ లేకుండా షో వేశారనీ.. తాము షో చూడకుండా ఇబ్బందిపడ్డామని అన్నారు. ఆందోళన చేసినవారికి మార్నింగ్ షో టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేశారు నిర్వాహకులు. తర్వాత షోను ఆలస్యంగా ప్రారంభించారు.  

Latest Updates