అరబిందో షేరు జోరు

అరబిందో షేరు జోరు

న్యూఢిల్లీ: అరబిందో హైదరాబాద్‌‌‌‌ ప్లాంట్‌‌కు సంబంధించి ఎటువంటి  రెగ్యులేటరీ చర్యలను తీసుకోమని అమెరికా డ్రగ్‌‌ నియంత్రణ సంస్థ తెలిపింది. దీంతో కంపెనీ షేరు బుధవారం సెషన్‌‌లో 20 శాతానికి పైగా లాభపడింది. ఇది ఈ కంపెనీకి గత పదేళ్లలో అతి పెద్ద సింగిల్‌‌ డే లాభం కావడం విశేషం. తాజాగా హైదరాబాద్‌‌ ప్లాంట్‌‌(యూనిట్‌‌ 4) ను తనిఖీ చేసిన యూఎస్‌‌ ఫుడ్‌‌ అండ్ డ్రగ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌(యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ), ఈ ప్లాంట్‌‌కు ‘వాలంటరీ యాక్షన్‌‌ ఇనిషియేటెడ్‌‌(వీఏఐ)’  స్టేటస్‌‌ను ఇచ్చింది. ఇంజెక్టబుల్స్​ను ప్రధానంగా ఈ ప్లాంట్‌‌లో కంపెనీ తయారు చేస్తోంది. వీఏఐ స్టేటస్‌‌ అంటే రెగ్యులేటరీ నుంచి ఎటువంటి ప్రతికూల చర్యలు ఉండవని అర్థం. వాలంటరీగా ఎటువంటి మార్పులనైనా చేసుకోవాలనుకుంటే కంపెనీ చేసుకోవచ్చు.  కంపెనీ అమెరికాకు ఎగుమతి చేసే మొత్తం డ్రగ్స్‌‌లో 10 శాతం ఈ ప్లాంట్ నుంచి జరుగుతుండడం గమనార్హం. ఈ ప్లాంట్‌‌కు వీఏఐ స్టేటస్‌‌ ఇవ్వడంతో అరబిందో షేరు బుధవారం సెషన్‌‌లో 20.78 శాతం పెరిగి రూ. 604.40 కి చేరుకుంది.

అరబిందోపై పాజిటివ్‌‌గా బ్రోకరేజిలు

గతేడాది కంపెనీకి చెందిన ఎనిమిది ప్లాంట్లను యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ తనిఖీ చేసింది. అరబిందోకి చెందిన యూనిట్‌‌ 7కు మాదిరే, యూనిట్‌‌ 4 కి  కూడా ‘అఫీషియల్‌‌ యాక్షన్‌‌ ఇండికేటెడ్‌‌’ స్టేటస్‌‌ వస్తుందని కంపెనీ భయపడిందని సెంట్రమ్‌‌ బ్రోకింగ్‌‌ ఎనలిస్ట్‌‌ సిండ్రిల్లా కర్వల్హో అన్నారు. ఈ స్టేటస్‌‌ వస్తే ఈ ప్లాంట్‌‌పై నియంత్రణ, అడ్మినిస్ట్రేటివ్‌‌ యాక్షన్లను తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్‌‌లోని యూనిట్‌‌ 4 కు వీఏఐ స్టేటస్‌‌ రావడంతో కంపెనీ షేరు రికార్డును నమోదు చేసింది. పెండింగ్‌‌లోని అనుమతులను పొందడానికి అరబిందోకి ఇది తోడ్పడుతుందని సిండ్రెల్లా అన్నారు. శాండజ్‌‌ డెర్మటాలజీ బిజినెస్‌‌ను అరబిందో కొనుగోలు చేయనుంది. దీనిపై దృష్టిపెట్టామని, కంపెనీ షేరుపై స్ట్రాంగ్‌‌ బైను కొనసాగిస్తున్నామని సిండ్రెల్లా అన్నారు.  యూనిట్‌‌ 4 కి చెందిన పెండింగ్‌‌లోని అబ్రివేటెడ్‌‌ న్యూ డ్రగ్‌‌ అప్లికేషన్లు(ఏఎన్‌‌డీఏ) తొందరగా పూర్తవుతాయని ప్రభుదాస్‌‌ లిల్లాధర్‌‌‌‌ బ్రోకరేజి తెలిపింది.

అరబిందోకి చెందిన హైదరాబాద్‌‌లోని యూనిట్ 4 నుంచి ఇప్పటి వరకు 46 ఏఎన్‌‌డీఏలు పెండింగ్‌‌లో ఉన్నాయి. మొత్తంగా కంపెనీకి పెండింగ్‌‌ ఉన్న అనుమతులలో ఇవి 25 శాతం వరకు ఉండడం గమనార్హం. యూనిట్‌‌ 4 కి అనుమతులు రావడంలో ఆలస్యమవుతుందని ప్రభుదాస్‌‌ అభిప్రాయపడింది. కంపెనీ లాభం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది కాలంగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటుచేసుకోవడంతో అరబిందో ఫార్మా లిమిటెడ్​ షేర్​ ధర బాగా తగ్గిపోయింది. తాజా పరిణామం మళ్లీ షేరు పుంజుకోవడానికి కారణమైంది.