ఎఫ్‌‌డీఏ అభ్యంతరాలతో కుదేలైన అరబిందో షేరు

ప్రతికూల వార్తల నేపథ్యంలో అరబిందో పార్మా లిమిటెడ్‌‌ షేర్లు 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పతనమయ్యాయి. తెలంగాణలోని ఒక ప్లాంట్‌‌లో గుడ్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ ప్రాక్టీసెస్‌‌ (జీఎంపీ) పాటించడం లేదని యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో షేర్‌‌ ధర తగ్గిపోయింది. సప్లైతోపాటు, ఫ్యూచర్‌‌ అప్రూవల్స్‌‌పైనా ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్‌‌ 19–27 మధ్య కంపెనీ ఫార్ములేషన్‌‌ యూనిట్‌‌–7ను యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అధికారులు తనిఖీ చేశారు. ఏడు అభ్యంతరాలతో ఫార్మ్‌‌ 483 జారీ చేశారు. డాక్యుమెంటేషన్‌‌ సరిగా లేకపోవడంతోపాటు,  ఎక్విప్‌‌మెంట్‌‌ క్లీన్లీనెస్‌‌, క్వాలిటీ కంట్రోల్‌‌పైనీ యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన అభ్యంతరాలు ఇబ్బందికరమైనవేనని ప్రభుదాస్‌‌ లీలాధర్‌‌ ఫార్మా ఎనలిస్ట్‌‌ సురజిత్‌‌ పాల్‌‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో అరబిందో ఫార్మా అమ్మే ఔషధాలలో మూడో వంతు ఇదే యూనిట్‌‌లో తయారవుతున్నాయని పేర్కొన్నారు. యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ వద్ద పెండింగ్‌‌లో ఉన్న ఎప్రూవల్స్‌‌లోనూ ఈ యూనిట్‌‌వే ఎక్కువని చెప్పారు. సోమవారం ట్రేడింగ్‌‌లో అరబిందో ఫార్మా షేర్లు ఏకంగా 20.64 శాతం పతనమై రూ. 450.35 కి చేరాయి. అక్టోబర్‌‌ 29, 2008 తర్వాత అరబిందో ఫార్మా షేర్‌‌ ఇంతలా కుప్పకూలడం ఇదే మొదటిసారి. సోమవారం నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌‌ కూడా 3.44 శాతం తగ్గింది.

యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అభ్యంతరాలు…

యూనిట్లో పాటించాల్సిన డాక్యుమెంటేషన్‌‌లో లోపాలు.

నిర్వహించిన టెస్ట్‌‌ల వివరాల డేటాను పూర్తిగా లేబొరేటరీ రికార్డులలో పొందుపరచకపోవడం.

క్వాలిటీ కంట్రోల్‌‌ విషయంలో పాటించాల్సిన అన్ని నిబంధనలనూ నెరవేర్చకపోవడం.

ఉత్పత్తికి వాడే ఎక్విప్‌‌మెంట్‌‌ను రెగ్యులర్‌‌ షెడ్యూల్‌‌ ప్రకారం క్లీన్‌‌ చేయకపోవడం.

రాతపూర్వకంగా ఉన్న ప్రాసెస్‌‌ కంట్రోల్‌‌ విధానాలను అనుసరించకపోవడం వంటి లోపాలను యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ ఎత్తిచూపింది. పై అభ్యంతరాలలో కొన్నింటిని యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ తీవ్రంగా పరిగణిస్తుంది. మూడు అభ్యంతరాలు ఇలా తీవ్రమైనవేనని, వాటిని పరిష్కరించుకోవడానికి అరబిందో ఫార్మాకు ఖచ్చితంగా కొంత సమయం పడుతుందని ఫార్మా కంపెనీలకు జీఎంపీ అడ్వైజర్‌‌గా వ్యవహరించే అమిత్‌‌ రాజన్‌‌  (ప్రొస్ఫోరా టెక్నాలజీస్‌‌) చెప్పారు.

అరబిందో పార్మా లిమిటెడ్‌‌కు యూనిట్‌‌ –7 చాలా ముఖ్యమైనది. ఈ యూనిట్‌‌కు 130 ప్రొడక్ట్స్‌‌ తయారీ అనుమతులు ఉన్నాయి. అలాగే,  అప్రూవల్‌‌పెండింగ్‌‌లో ఉన్న 30 అప్లికేషన్స్‌‌  ఈ యూనిట్‌‌కు చెందినవేనని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌ ఫార్మా ఎనలిస్ట్‌‌ ఆమీ ఛాక్‌‌ తెలిపారు.