ఐపీఎల్ కు లైన్ క్లియర్ అవుతుందా?

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆఖర్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ను 2022వ సంవత్సరానికి పోస్ట్‌పోన్ చేసి.. అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ఐసీసీ) టెలీ కాన్ఫరెన్స్ లో చర్చిస్తారని సమాచారం. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ పోస్ట్ పోన్ గురించి అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలిసింది. దీనిపై ఓ ఐసీసీ బోర్డు మెంబర్ స్పందించారు. టీ20 వరల్డ్ కప్ తోపాటు ఐపీఎల్, ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సిరీస్ గురించి ఆ మెంబర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘గురువారం జరిగే బోర్డు మీటింగ్ లో టీ20 వరల్డ్ కప్ వాయిదాపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన ఉంటుందా లేదా అనేదే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 వరల్డ్ కప్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి తక్కువ చాన్సెస్ ఉన్నాయి. దీన్ని క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఇతర టాప్ బోర్డులు పెద్దగా పట్టించుకుంటాయని నేను అనుకోను. కానీ ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానాలు కావాలి. వచ్చే జనవరి–ఫిబ్రవరిలో పొట్టి ప్రపంచకప్ నిర్వహించడం వాణిజ్యంగా సాధ్యమేనా? అంతకంటే ముందు, అక్టోబర్–నవంబర్ విండోలో ఓ ఐపీఎల్ అలాగే మార్చి–మే విండోలో మరో ఐపీఎల్ ఎలా నిర్వహిస్తారు? ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో మూడు పెద్ద టోర్నమెంట్ ల నిర్వహణపై మేం సమాలోచనలు చేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ టోర్నీల నిర్వహణ అసంభవం. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటన జరగొచ్చు. అలాగే ఐదు వన్డేల కోసం ఇండియాకు ఇంగ్లండ్ రావడం దాదాపుగా సాధ్యమే. అదే సౌతాఫ్రికా టీ20 సిరీస్ విషయంలో ఐసీసీ పాలసీ మ్యాటర్స్ ను బట్టి క్రికెట్ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకోవాలి’ అని ఒక ఐసీసీ బోర్డు మెంబర్ చెప్పారు.

Latest Updates